Tuesday, November 26, 2024

బీసీ సమస్యలపై ఆగస్టు 2-3 తేదీల్లో జంతర్‌మంతర్ వద్ద ధర్నా..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు సహా అనేక ఇతర బీసీ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 2, 3 తేదీల్లో తలపెట్టిన బీసీల ఆందోళన కార్యక్రమానికి వివిధ పార్టీల నేతల మద్ధతు కోరుతూ బీసీ సంక్షేమ సంఘం వైఎస్సార్సీపీ సహా పలు పార్టీల ఎంపీలను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ కలిసి తమ ఆందోళన కార్యక్రమానికి మద్ధతు కోరారు. జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌తో పాటు ఎంపీలు తలారి రంగయ్య, రెడ్డప్ప, గొడ్డేటి మాధవిలను కలిసి ఆహ్వానించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీల సంక్షేమం కోసం, బీసీల ప్రయోజనాల కోసం పాటుపడుతూ చేపట్టిన కార్యక్రమాలను వేణుమాధవ్ గుర్తుచేస్తూ కొనియాడారు. బీసీ హక్కుల ఉద్యమకారుడు ఆర్. కృష్ణయ్యను పెద్దల సభకు పంపడం ద్వారా వైఎస్సార్సీపీ బలమైన సందేశాన్ని పంపిందని అన్నారు. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు వంటి ప్రధానాంశంతో పాటు పదోన్నతుల్లో బీసీ రిజర్వేషన్ల అమలు, కులాలవారిగా జనాభా లెక్కల సేకరణ వంటి డిమాండ్ల సాధన కోసం తాము ఈ ఆందోళన కార్యక్రమాన్ని తలపెట్టినట్టు కర్రి వేణుమాధవ్ ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ హక్కుల సాధన కోసం మద్ధతిచ్చే అన్ని పార్టీల నేతలనూ కలిసి ఆహ్వానిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement