హైదరాబాద్ – సైబర్ నేరాల నివారణకు, సైబర్ భద్రతకు భరోసా కల్పించేందుకు తెలంగాణ పోలీసులు వినూత్నమైన పటిష్టమైన చర్యలు చేపట్టడం ద్వారా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అన్నారు. గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్, డిజిటల్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ-2023 ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సైబర్ స్పేస్ మేనేజ్‌మెంట్ కోసం నేషనల్ ఆర్కిటెక్చర్’ అనే అంశంపై అంజనీ కుమార్ ప్రసంగించారు. సైబర్ నేరాలను పరిశోధించడానికి, నిరోధించడానికి ప్రత్యేకమైన సైబర్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మైక్రోసాఫ్ట్‌తో సహా ప్రపంచంలోని దాదాపు 600 ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో స్థాపించయన్నారు. దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారని అన్నారు. సైబర్ నేరాలను అరికట్టడానికి, గుర్తించడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అయితే సైబర్ క్రైమ్ కేసులు పెరిగిపోయాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌గా మారిందని డీజీపీ పేర్కొన్నారు.
సైబర్ సెక్యూరిటీలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసినట్లు అంజనీకుమార్ తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ బ్యూరోలో దాదాపు 500 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. సైబర్ నేరాల నియంత్రణలో ఇప్పటికే ఏర్పాటు చేసిన తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (టీ4సీ) కీలక పాత్ర పోషిస్తోందని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1930 ద్వారా ప్రజలను అప్రమత్తం చేసిన తర్వాత సైబర్ ఆధారిత ఆర్థిక నేరాల పరంగా తెలంగాణ పోలీసులు విజయవంతంగా రూ. 65 కోట్లను నిలిపివేశారు. సైబర్ నేరాలను నిరోధించడానికి, తెలంగాణ పోలీసులు అదే సమయంలో సామాన్య ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు; సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని 800 పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్‌లుగా పోలీసు అధికారులు శిక్షణ పొందారని డీజీపీ తెలిపారు.