సిద్దిపేట, ప్రభన్యూస్ ప్రతినిధి: ప్రజల రక్షణకు సెన్సాఫ్ సెక్యూరిటీ చాలా ముఖ్యమని, కొత్త టెక్నాలజీని అందుపుచ్చుకొని ముందుకు వెళ్లాలని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ కోరారు. శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌ను, పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌ను సందర్శించారు. అనంతరం కమిషనర్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ మనం కూడా మారాలని.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ప్రతి ఒక్క అధికారి అందిపుచ్చుకోవాలని సూచించారు.
గత 6, 7 నెలలలో 600 మంది పోలీస్ అధికారులకు ఇన్‌స్పెక్టర్ నుండి డీఎస్పీ, డీఎస్పీ నుండి అడిషనల్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ నుండి నాన్ క్యాడర్ ఎస్పీలుగా ప్రమోషన్ ఇవ్వడం జరిగిందన్నారు. అధికారులందరూ వారికి కేటాయించిన ప్రదేశాలలో విధి నిర్వహణలో నిమగ్నమైనారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పోలీస్ స్టేషన్‌లలో సబ్ డివిజన్ నిధులు కేటాయించి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి, గత 10, 15 సంవత్సరాల క్రితం ఉన్న పోలీసింగ్ ఇప్పుడు లేదని, కమ్యూనిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో మొత్తం 750 పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయని, ఏ ఒక్క పోలీస్ స్టేషన్‌లోనైనా పోలీసులు ఏ చిన్న తప్పు చేసినా మొత్తం డిపార్ట్మెంట్ మీద పడుతుందని, ప్రతి ఒక్కరూ ఆలోచించి విధులు నిర్వహించాలని.. సెల్ఫ్ రెస్పెక్ట్ (ఆత్మగౌరవం), క్రమశిక్షణ పారదర్శకతతో విధులు నిర్వహించాలని సూచించారు. విధినిర్వహణలో మిస్ కమ్యూనికేషన్ ఉండవద్దన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సంబంధిత పోలీస్ అధికారులు ప్రతిరోజు గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై ప్రజల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి పోలీస్ అధికారి అన్ని రకాల విధులు నిర్వహించాలని తెలిపారు.
సంబంధిత ఎస్‌ఐల బాధ్యత చాలా ముఖ్యమని తెలిపారు. డిపార్ట్మెంటుకు కొత్తగా వచ్చిన అధికారులకు రాబోవు సంవత్సరాలలో మంచి భవిష్యత్తు ఉంటుందని, టెక్నాలజీని బాగా నేర్చుకోవాలని కోరారు. ఒకరినొకరు ఎప్పుడూ పోల్చుకోవద్దని, విధి నిర్వహణలో మాత్రమే పోటీ-పడి విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఒక్క పోలీస్ అధికారికి నీతి, నిజాయితీ, సెల్ఫ్ రెస్పెక్ట్, సంస్కృతి, సాంప్రదాయాలు చాలా ముఖ్యమన్నారు. క్రైమ్ రేట్ తగ్గించే విధంగా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా ఛేదించి సరైన సమయంలో చార్జ్‌షీట్ వేయాలని, కేసులలో శిక్షణ శాతం పెంచాలన్నారు.
ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా విధులు నిర్వహించాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ మనుగడకు చాలా ముఖ్యమని తెలిపారు. చట్టాలను గౌరవిస్తూ విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ లీడర్‌షిప్ లక్షణాలు అలవర్చుకోవాలన్నారు. నిత్య విద్యార్థి లాగా ప్రతిరోజు కొత్తదనాన్ని నేర్చుకోవాలని తెలిపారు. అలాగే కొత్తదనం గురించి అన్వేషించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అధునాతనమైన వాహనాలను అందించడం జరిగిందన్నారు. ప్రజల రక్షణకు సెన్సాఫ్ సెక్యూరిటీ- చాలా ముఖ్యమని తెలిపారు. విధి నిర్వహణలో టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యమన్నారు.