హైదరాబాద్ – కార్తిక పౌర్ణమి సందర్భంగా. ఏపీ, తెలంగాణాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు.
ఉసిరిచెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దీపారధన చేస్తున్నారు. శివనామస్మరణ చేస్తూ 365 ఒత్తులను వెలిగిస్తున్నారు. శివపార్వతులకు అభిషేకాలు చేశారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతున్నది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది.
వరంగల్ వేయిస్తంభాల దేవాలయంలో భక్తులు ఉసిరి చెట్టు కింద పూజలు చేసి దీపాలు వెలిగించారు. అనంతరం స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. .
హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయం, జనగామ జిల్లాలోని పాలకుర్తి శ్రీ సోమేశ్వరస్వామి, కొడవటూరు సిద్దులగుట్ట, ములుగు జిల్లా వెంకటాపురంలోని రామప్ప తదితర ఆలయాలకు భక్తులు వేలాదిగా తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు
కాళేశ్వరం గోదావరి దగ్గర కార్తీక పౌర్ణిమ శోభ సంతరించుకుంది. పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి దీపాలను భక్తులు గంగలో వదిలారు.
మహబూబాబాద్ జిల్లా కందికొండ జాతరకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో కందికొండ భక్తులతో రద్దీగా మారింది. దైవ దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతుండటంతో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది.
భద్రాచలంలో గోదావరి తీరాన భక్తులు కార్తిక మాస పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కార్తిక దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు.
హైదరాబాద్లోని శివాలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు..
అమరావతిలో కృష్ణమ్మ చెంత మహిళలు తెప్పలు వదిలారు. సూర్యలంక, చీరాల, చినగంజాం, పెదగంజాం సముద్ర తీరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు స్నానమాచరించారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్రాక్షారామం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, మహానంది తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొంది.