శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివెళ్తున్నారు.
ఎరుమేలికి నాలుగు కిలో మీటర్ల ముందే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తెల్లవారు జామునుంచి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్నారు.అదే సమయంలో స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతున్నది. ఈక్రమంలో పలువురు భక్తులు స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు. స్వామివారి మాలధారణలో చిన్నారులు సైతం ఉండగా.. తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరో వైపు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో శబరిమల ఆలయానికి సంప్రదాయ అటవీ మార్గంలో వెళ్లేందుకు ప్రభుత్వం సమయాన్ని పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అనుమతి ఇచ్చింది. ఈ సాంప్రదాయ అటవీ మార్గం ఎరుమేలి నుంచి పంపా వరకు అటవీ మార్గం గుండా ఎనిమిది గంటల ప్రయాణం ఉంటుంది.