ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ఏప్రిల్ 25నుంచి ఇప్పటివరకు కేదార్‌నాథ్‌ను 6లక్షల మంది సందర్శించారు. బద్రీనాథ్ తెరిచినప్పటి (ఏప్రిల్ 27) నుంచి 5లక్షల మంది దర్శించుకున్నారు. కాగా కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను నిత్యం సరాసరి 20వేల మంది సందర్శిస్తున్నారని, కానీ అక్కడి సామర్థ్యం రోజుకు కేవలం 10వేలు మాత్రమేనని అన్నారు. ఇలా సామర్థ్యానికి మించి విపరీతమైన సంఖ్యలో భక్తులు వస్తోన్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ పోలీసులు కీలక సూచనలు చేశారు.
రద్దీ ఎక్కువ కావడంతో అన్ని రకాలుగా అసౌకర్యం ఏర్పడుతోంది. ట్రాఫిక్ మేనేజిమెంట్‌కు ఇబ్బందిగా మారడంతోపాటు ఆలయాలకు వెళ్లే ట్రెకింగ్ మార్గాలు కొన్నిసార్లు జామ్ అవుతుండటం, భక్తులకు దర్శనం సాఫీగా సాగకపోవడానికి కారణం అవుతున్నాయి. మే, జూన్‌లోనే ఈ యాత్ర ఉంటుందని చాలామంది భక్తులు భావిస్తుంటారు. నవంబర్ రెండో వారం వరకూ ఈ యాత్ర కొనసాగుతుంది. ఆలయాలను దర్శించడానికి సెప్టెంబర్ రెండో వారం తర్వాత అనుకూలమైన సమయం. అందుకే అందుకు అనుగుణంగా భక్తులు తమ ప్రయాణాన్ని మార్చుకోండి’ అని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు.