Friday, November 22, 2024

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 20 గంటల స‌మ‌యం

తిరుమల, (ప్రభన్యూస్‌) : వారాంతపు సెలవులు కావడంతో శనివారం తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనార్దం రెండు నడకదారులు, రోడ్డు మార్గాన భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లు నిండి క్యూ లైన్‌లు వెలుపలకు వ్యాపించాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లు కూడా భక్తులతో నిండిపోవడంతో శిలాతోరణం వైపు గుండా ఔటర్‌ రింగ్‌రోడ్డు వైపునకు క్యూ లైన్‌ వ్యాపించింది. స్వామివారి దర్శనం కోసం దాదాపు రెండు కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్‌లో వేచివున్నారు.

దీంతో శ్రీవారి ఉచిత దర్శనానికి 20 గంటలు సమయం పడుతుంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటలు సమయం పడుతుంది. భక్తుల రద్దీ మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉండడంతో టీటీడీ అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్‌లోవేచివున్న భక్తులకు శ్రీవారి సేవకుల సహాయంతో అన్నప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు తాగునీరు, మజ్జిగ తదితరాలను పంపిణీ చేస్తుండడంతో భక్తులు కొంత ఉపశమనం పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement