కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ల కోసమో, ఎన్నికల్లో గెలుపు కోసమో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని, ప్రజల జీవితాల్లో నాణ్యత పెరగడానికే పలు అభివృద్ధి పనులు చేపడుతోందని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న పార్టీ, దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదని ప్రధాని మోడీ ఆరోపించారు. గిరిజన ఏరియాలను అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడాలని ప్రధాని అభిప్రాయ పడ్డారు. కష్టసాధ్యంతో కూడుకున్న గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి రాలేదని ప్రధాని మోడీ గుజరాత్‌లోని గౌరవ్ అభియాన్ ర్యాలీలో విమర్శించారు. ప్రధాని మోడీ శుక్రవారం గుజరాత్‌లో పర్యటించారు.
ఒక్కరోజు పర్యటన సందర్భంగా, ప్రధాని మోడీ నవసరి జిల్లాలోని గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం రూ.3,050 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గతంలో గిరిజనులు నివసించే ప్రాంతాలను చేరుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టేదని ప్రధాని అన్నారు. వ్యాక్సినేషన్ కోసం కొన్ని నెలల పాటు ప్రచారం చేయాల్సి వచ్చేదని ప్రధాని అన్నారు. కానీ, ఇప్పుడు వారి జీవనవిధానం సైతం మారిందని, వారికి సైతం పట్టణాల్లో మాదిరిగా అన్నీ అందుబాటులో ఉన్నాయని ప్రధాని మోడీ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి, మీకు కరోనా వైరస్ వ్యాక్సిన్ డోస్ ఉచితంగా అందిందా లేదంటే, డబ్బు పెట్టి వేసుకున్నారా అని ప్రశ్నించగా, వారి నుంచి ఉచితం అన్న సమాధానం వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా గుజరాత్‌లో వేగంగా జరిగిన అభివృద్ధి దేశానికి గర్వకారణమైందని ప్రధాని అన్నారు.
ప్రధాని మోడీ ఒక్కరోజు గుజరాత్ పర్యటన సందర్భంగా ఆయనకు ప్రాథమిక పాఠశాలలో చదువు నేర్పిన టీచర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ప్రధాని మోడీ తన స్వగ్రామం వడ్‌నగర్‌లోని వెర్నాక్యులర్ స్కూల్‌లో ప్రైమరీ ఎడ్యుకేషన్‌ను పూర్తి చేశారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి 2017లో మోడీ తాను చదువుకున్న స్కూలుకు అకస్మాత్తుగా వెళ్లారు. పాఠాలు చెప్పిన టీచర్‌ను కలిశారు. వడ్‌నగర్ నుంచి వచ్చిన ఉపాధ్యాయుడుని ప్రధాని నవసరిలో కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఒక్కరోజు పర్యటనలో ప్రధాని పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. గుజరాత్ గౌరవ్ అభియాన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. నవసరిలోని గిరిజన ప్రాంతం కుద్వేల్లో రూ. 3,050కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రధాని మోడీ పర్యటనలో ఏడు ప్రాజెక్టులను ప్రారంభించారు. పన్నెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 14 ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా గిరిజన ప్రాంతానికి నీటి సరఫరా మెరుగు పడుతుంది. వారి జీవితాలు మెరుగుపడేందుకు సౌకర్యాలు గణనీయంగా పెరుగుతాయి. రూ. 961 కోట్లతో చేపట్టనున్న 13 నీటి సరఫ రా ప్రాజెక్టులకు ప్రధాని మోడీ భూమిపూజ చేశారు. నవసరి జిల్లాలో ఏర్పాటుకానున్న మెడికల్ కాలేజ్‌కు కూడా ప్రధాని మోడీ భూమి పూజ నిర్వహించారు. రూ. 542 కోట్లతో మెడికల్ కాలేజ్‌ను నిర్మించనున్నారు. తద్వారా మెరుగైన వైద్యసదుపాయాలు ఆ ప్రాంత ప్రజలకు అందనున్నాయి. ఆస్టాల్ ప్రాంతానికి నీటి సరఫరా కోసం కట్టనున్న మధుబాన్ డ్యాంను ప్రధాని మోడీ ప్రారంభించారు.
రూ.586 కోట్లు. నల్ సే జల్ ప్రాజెక్టు రూ. 163 కోట్లు. ఈప్రాజెక్టు ద్వారా సూరత్, నవసరి, వల్సాద్, తపి జిల్లాలకు నీటి సరఫరా జరగనుంది. తపి జిల్లావాసులకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించేందుకు రూ. 85 కోట్లతో నిర్మించిన విరుపుర్ వ్యారా సబ్‌స్టేషన్ ను ప్రధాని ప్రారంభించారు. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ. 21 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ క్వార్టర్లను సైతం ప్రధాని ప్రారంభించారు. పిప్లైదేవి, జ్యునెర్, చిచువిహిర్, పిపాల్డాహాద్ రోడ్లతో పాటు దంగ్‌లో రూ. 12 కోట్లతో నిర్మించిన స్కూల్ భవనాలను కూడా ప్రధాని ప్రారంభించారు. రూ. 549కోట్లతో నిర్మించనున్న ఎనిమిది నీటి సరఫరా ప్రాజెక్టులను సైతం ప్రధాని ప్రారంభించారు. ప్రధాని మోడీ హెల్త్ కేర్ కాంప్లెక్స్ , మల్టి స్పెషాలిటీ ఆస్పత్రిని సైతం ప్రారంభించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.