Friday, November 22, 2024

TG | హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. వరంగల్ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఫోకస్‌ పెట్టారు. ఈ సంద‌ర్భంగా వరంగల్ జిల్లా సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలన్నారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

హెలికాప్టర్‌లో గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న రేవంత్ రెడ్డి టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణ పురోగతిని పరిశీలించారు. పార్క్ నిర్మాణం ఎక్కడి దాకా వచ్చిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. వనమహోత్సవంలో భాగంగా మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఆవరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, అధికారులు మొక్కలు నాటారు.

అనంతరం జరిగిన సమావేశంలో రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. టెక్స్‌టైల్ పార్క్‌ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. టెక్స్‌టైల్‌ పార్క్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించేందుకు కృషి చేస్తామన్నారు. టెక్స్‌టైల్‌ పార్కు సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపడుతామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

కలెక్టరేట్‌లో ప్లాంటేషన్‌తో పాటు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభిస్తామన్నారు.. స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా చేపట్టినవి, ప్రగతిలో ఉన్నవి, చేపట్టాల్సిన పనులపై రివ్యూ చేస్తారని తెలిపారు. వరంగల్ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 2050ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

నగరంలో భూగర్భ డ్రైనేజీ, స్మార్ట్‌ సిటీ పథకంపై అధికారులకు పలు సూచనలు చేశారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై కూడా పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు గురించి ఆదేశాలు జారీ చేశారు. వాటికి సంబంధించిన భూసేకరణను పూర్తి చేయాలని చెప్పారు.

- Advertisement -

నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ నగర అభివృద్ధిపై ఇకనుంచి ప్రతీ 20రోజులకోసారి ఇన్ చార్జి మంత్రి సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement