Friday, November 22, 2024

Follow Up | విమానాశ్రయాలతో సమానంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశంలోని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాలతో సమానంగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే కనెక్టవిటీ ముఖ్యమని పేర్కొన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌-సికింద్రాబాద్‌-విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్‌ రైలును మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ప్రారంభమైన రైలు పాలమూరు ప్రాంత ప్రజలను నేరుగా కాచిగూడతో పాటు కాజీపేట, వరంగల్‌, విజయవాడ, ఏలూరు, సామర్లకోట, దువ్వాడ తదితర ముఖ్యమైన నగరాలను కలుపుతుందని పేర్కొన్నారు. రైల్వే మౌలిక సదుపాయాలు, విద్యుదీకరణ, ప్రయాణికుల సౌకర్యాల సదుపాయం, మెరుగైన రైలు కనెక్టివిటీ పరంగా ఇటీవలి సంవత్సరాలలో తెలంగాణ ప్రాంతంలో రైలు అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.

- Advertisement -

కనెక్టివిటీని మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనుల కోసం రూ.1400 కోట్లు వెచ్చించిందని వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో త్వరలో వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌లో ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించేలా చర్లపల్లిలో శాటిలైట్‌ టెర్నినల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

త్వరలో ఈ ప్రాంతానికి అనుసంధానిస్తూ జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్‌ను షాద్‌నగర్‌లలో ఆపాలని స్థానికులు కోరారనీ, ఈ విషయాన్ని ద.మ.రైల్వే జీఎం దృష్టికి తీసుకువెళతానని స్పష్టం చేశారు. విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను మహబూబ్‌నగర్‌ వరకు పొడిగించడం వల్ల ఈ ప్రాంత ప్రజలు నేరుగా వరంగల్‌, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, అన్నవరం,విశాఖపట్టణం వెళ్లేందుకు మార్గం సుగమమైందన్నారు. ఈ రైలు మహబూబ్‌నగర్‌, విశాఖపట్టణం రెండు స్టేషన్ల నుంచి సౌకర్యవంతమైన రాత్రి ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement