Tuesday, November 19, 2024

AP | 400 కోట్లతో కనకదుర్గమ్మ, శ్రీశైలం దేవస్థానాల అభివృద్ధి..

అమరావతి, ఆంధ్రప్రభ : విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి, శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానాల అభివృద్ది పనులను సుమారు రూ.400 కోట్లతో నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రూ.400 కోట్ల నిధులలో రూ.225 కోట్లను శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్దికి, రూ.175 కోట్లను శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ది పనులకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్దికై వాస్తుపండితులు, స్తపతులు, పలువురు నిపుణులతో ఏర్పాటు చేసిన సాంకేతిక సలహా కమిటీ సూచనలతో మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించామన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు టెండర్ల ఖరారు ప్రక్రియ కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెలలోనే ఆ మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టనున్నారన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ గురించి మంత్రి వివరించారు.

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ది పనులకు రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అభివృద్ది పనులను రూ.175 కోట్లతో చేపట్టినట్లు మంత్రి తెలిపారు. రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్సు, రూ.40 కోట్లతో సాల మండపాల నిర్మాణం, మాడ వీధుల అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు.

దాదాపు 4,600 ఎకరాల భూమిని ఆలయ పరిధిలోకి తీసుకు రావడం జరిగిందని, దాని ఫెన్సింగ్‌ కార్యక్రమాన్ని త్వరలో శంకుస్థాపన చేయనున్నామన్నారు. సనాతన హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో ధర్మ ప్రచార పరిషత్‌ సనాతన హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 175 6(ఎ) దేవాలయాల్లో కూడా నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని మంత్రి కొట్టు- తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబరు మాసంలో ప్రారంభించడం జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement