Friday, November 22, 2024

భద్రాద్రి పరిసరాల అభివృద్ధికి పర్యాటక శాఖ ప్రణాళిక.. కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ

ఆంధ్రప్రభ: హైదరాబాద్ : గోల్కొండ రాజుల కాలంలో నిర్మించిన చారిత్రాత్మక భద్రాద్రి శ్రీరామ దివ్య క్షేత్రం పరిసరాలను ఆధునీకరించేందుకు కేంద్ర పర్యాటక శాఖతో కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి పనులను ప్రారంభించనుంది. భద్రాద్రి చుట్టూ రిటనింగ్‌ వాల్‌ నిర్మించి వరదల తాకిడికి అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. దేశంలోని అనేక ప్రాంతాలనుంచి నిత్యం వేలాది మంది భక్తులు సీతారాములను దర్శించుకునేందుకు వస్తుండటంతో సౌకర్యాలను మెరుగుపర్చేందుకు పర్యాటక శాఖ కార్యక్రమాలను రూపొందించింది.

టెంపుల్‌ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర టూరిజం కార్పోరేషన్‌ ప్రణాళికను రూపొందించింది. 16 వ శతాబ్దం నాటి ఈ ఆలయ పరిసరాల్లో ఉన్న చారిత్రిక సంపద పరిరక్షణతో పాటుగా భక్తులు, పర్యాటకులకు సౌకర్యాలను మెరుగు పర్చేందుకు కార్పొరేషన్‌ సిద్ధమైంది. భద్రాద్రి రామాలయం పరిసరాల్లో పర్యాటకాభివృద్ధి కోసం రాష్ట్ర టూరిజం కార్పోరేషన్‌ సమర్పించిన డీపీఆర్‌ ను ప్రసాద్‌ పథకంలో భాగంగా కేంద్ర పర్యాటకాభివృద్ధి శాఖ ఆమోదించింది. అయితే సుమారు రూ. 100 కోట్ల ప్రాజెక్టు కు రూ. 41.38 కోట్ల ఆమోదంతెలిపింది.

ఈ నేపథ్యంలో టూరిజం కార్పోరేషన్‌ మిగతా నిధులను సమకూర్చి అభివృద్ధి పనులకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. 2023 చివరివరకు అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ దాదాపుగా టెండర్లను ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ స్కీంకు మరిన్ని నిధులు కలిపి దశలవారిగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో టూరిజం కార్పోరేషన్‌ సిద్ధమైంది. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా భదాద్రి రామాలయంలో డిజిటల్‌ ప్రొజెక్షన్‌ రూం, వ్రతమంటపం, ప్లోరింగ్‌, నిత్యకళ్యాణ మంటపం, ప్రసాదాల తయారీ ఆధునీకరణ, మాడవీధులు అభివృద్ధి పనులున్నాయి.

- Advertisement -

అలాగే భద్రాచలం ఆలయ పరిసరాల్లో 1.3 కి.మీ. అప్రోచ్‌ రోడ్‌, హరిత హోటల్‌, టెంపుల్‌ ఘాట్‌ ఏరియా అభివృద్ధి తో పాటుగా నది కట్టల మరమ్మతులు ఉన్నాయి. అలాగే భద్రాచలం ప్రవేశానికి ముందు వంతెనలు, బ్యాటరీ కార్లు, బ్యాటరీ కార్ల సర్వీసింగ్‌ కేంద్రంతో పాటుగా ఆలయం చుట్టూ కంపౌండ్‌ వాల్‌ నిర్మించే పనులు పురోగతిలో ఉన్నయని పర్యాటక శాఖ అధికారులు చెప్పారు. పర్ణశాల అభివృద్ధి తోపాటుగ ఆలయ ప్రాంతంలోని వీధిదీపాల మరమ్మతులు, రైలింగ్‌ క్యూలు నిర్మించనున్నరు.

ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని ఆధునీకరించేందుకు టెండర్లను ఖరారు చేశారు. అలాగే భద్రాద్రి పరిసరాల్లో ఉన్న దివ్యక్షేత్రాలను, పరివార దేవాతా ఆలయాల అభివృద్ధి చేసి టెంపుల్‌ టూరిజాన్ని ప్రోత్సహించాలనే యోచనతో రాష్ట్ర పర్యాటక శాఖ నమగ్నమైంది. పురాణ,హితాహాసాల్లో ఉన్న ఈ ఆలయ ప్రస్తావనలును భక్తులకు వివరించేందుకు లేజర్‌ లైటింగ్‌ షోలు ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. తెలంగాణలోని అత్యంత ప్రాచీన ఆలయాల్లో భద్రాద్రి రామాలయానికి ప్రత్యేకత ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రసాద్‌ స్కీం కింద మొక్కుబడిగా మంజూరు చేసిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులు జతచేసి అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement