న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలతో పాటు అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలో వచ్చే నెల 3, 4 తారీకుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి కేంద్రమంత్రులను ఆహ్వానించేందుకు ఆయన రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలిసి ఢిల్లీ పర్యటన చేపట్టారు. గురువారం పలువురు మంత్రులను కలిసిన అనంతరం అమర్నాథ్ న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చాటి చెప్పడం కోసం ఈ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో మొత్తం 13 సెక్టార్స్ మీద ఫోకస్ చేశామని చెప్పారు. ఈ క్రమంలో 13 సెక్టార్స్‌కి సంబంధించిన కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డి, మన్సూఖ్ మాండవియా, సర్బానంద్ సోనోవాల్, అశ్విని వైష్ణవ్‌లను కలిసి విశాఖలో నిర్వహిస్తున్న సదస్సు గురించి వివరించి, దానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించామని వెల్లడించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ముంబై వెళ్లి పారిశ్రామిక దిగ్గజాలైన టాటా, మహీంద్రా, అంబానీ గ్రూపు పెద్దలను కలిసి ఆహ్వానం పలికామని తెలిపారు. దేశంలో 3 పారిశ్రామిక కారిడార్లు, పోర్టులతో పాటు ఎన్నో సానుకూల అంశాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనువైన ప్రాంతమని మంత్రి వివరించారు. మూడు పారిశ్రామిక కారిడార్లలో 49 వేల ఎకరాల పారిశ్రామిక భూములు ప్రభుత్వాధీనంలో ఉన్నాయని వెల్లడించారు. 974 కి.మీ విశాల సాగర తీరంతో ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా, అపార వనరులు, అవకాశాల నిలయమైన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో సుసంపన్నత దిశగా అడుగులేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. త ప్రభుత్వ హయాంలో రూ 18 లక్షల కోట్ల పెట్టుబడులని చెప్పినా అందులో పది శాతం మాత్రమే అమలయ్యాయని చెప్పారు. ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా కనిష్టంగా రూ. 1.87 కోట్ల పెట్టుబడులను సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. వాస్తవంగా పెట్టుబడులు పెట్టే అంశాలనే తాము ప్రస్తావిస్తున్నామన్నారు. దేశ ఫార్మా ప్రగతి రథ చోదకశక్తిగా ఏపీ ఎదుగుతోందని, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు.
లోకేష్ యాత్రకు కార్యకర్తలను పంపాలా?
ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ విశాఖ భవిష్యత్‌లో పాలనాపరమైన రాజధానిగా ఉంటుందని, తాను కూడా అక్కడికి వెళ్తున్నానని ఆయన చెప్పడంలో తప్పేమీ లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖ కాస్మోపాలిటన్ నగరమని అన్నారు. అలాగే రాజధాని విషయంలో ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. 3 రాజధానుల ద్వారా వికేంద్రీకృతాభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానమని, అమరావతి కూడా అందులో ఒకటన్నారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ పాదయాత్ర సైకో అయ్యేలా ఉన్నాడని ఎద్దేవా చేశారు. కూలీ ఇచ్చి మరీ దెబ్బలు తిన్నట్టుగా బాబు వ్యవహార శైలి ఉందని చమత్కరించారు. సుప్రీంకోర్టులో కేంద్రం రాజధాని విషయంలో గతంలో ఏం చెప్పిందో ఇప్పుడు కూడా అదే చెప్పిందని స్పష్టం చేశారు. అప్పుడు కేంద్రం చెప్పిన దానిని చదవని చంద్రబాబు, ఆయన రాజగురువు కొత్తగా ఏదో చెబుతున్నారని అమర్నాథ్ విమర్శించారు.
రాజధానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తి చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన ఎన్నారైలా అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇవ్వక ముందే రాజధాని ఎక్కడ పెట్టాలో గత ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోపించారు. అతిపెద్ద స్కాం ఏదైనా ఉందంటే అది అమరావతేనని మండిపడ్డారు. తామేమీ రాజధానిని మార్చుతామనలేదని, అమరావతి కూడా ఒక రాజధానిగా ఉంటుందని మరోసారి నొక్కి చెప్పారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ సీఎం జగన్ విధానమని అమర్నాథ్ నొక్కి చెప్పారు. తన యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని లోకేష్ ఆరోపిస్తున్నారని, తామే జనాన్ని కూడా సమకూర్చాలా? ఆయన పాదయాత్రకు తమ పార్టీ కార్యకర్తలను పంపాలా అని ప్రశ్నించారు. లోకేష్ తమ స్టార్ క్యాంపెయినరని, ఆయన ఎంత తిరిగితే తమకు అంత మంచిదని అభిప్రాయపడ్డారు.