న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖ లింగేశ్వర క్షేత్రానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ప్రధానార్చకులు నాయుడుగారి రాజశేఖర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వమూ ఈ ఆలయానికి నిధులు కేటాయించకుండా మౌలిక వసతులు లేని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని పట్టించుకోకపోవడం ఎంతవరకూ సబబని రాజశేఖర్ ప్రశ్నించారు.
సొంత ఖర్చులతో ఢిల్లీ వచ్చిన ఆయన కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న శ్రీముఖ లింగేశ్వర క్షేత్ర అభివృద్ధికి సహకరించాలంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి వినతి పత్రం సమర్పించారు. గతంలో కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారనని అర్చకులు రాజశేఖర్ తెలిపారు. కేంద్ర పురావస్తు శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ త్రిపాఠిని కలిసి ఆలయ దుస్థితిని వివరించానని, కేంద్ర నిధులతో తప్పకుండా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...