హర్ధనహళ్లి దొడ్డగౌడ దేవెగౌడ..భారతదేశపు మాజీ ప్రధాని..88 ఏళ్ల కురు వృద్ధుడు..ఇంకా భారతదేశ రాజకీయాల మీద అణువంతయినా ఆసక్తి సన్నగిల్లని నాయకుడు..ఏ చిన్న అవకాశమొచ్చినా అధికారాన్ని వదులుకో కూడదన్నపట్టుదలకు ఆయనే నిలువెత్తు నిదర్శనం. డిసెంబరు పదిన కర్నాటక రాష్ట్రంలోని తుమకూరు మున్సిపాలిటీకి ఎన్నికలున్నాయి. అది వొక్కళిగల కోట. మున్నిపాలిటీ అయితేనేమి..ఆయన మాజీ ప్రధాని అయితేనేమి..ఎన్నిక ఎన్నికే అనుకున్నారు.
అందుకే ఆ కోటను హస్తగతం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. కొడుకు కుమారస్వామిని కూడా పక్కన పెట్టుకోకుండా తానే రంగప్రవేశం చేశారు. అదీ వ్యూహాత్మకంగానే. కొరటాగెరె తాలూకాలో ఉన్న కుంచితగ వొక్కళిగ మఠానికి వెళ్లి ఆ మఠాధిపతి హనుమంతనాధ స్వామిని కలిశారు. మొత్తం పన్నెండు గంటలపాటు ఆ ప్రాంతమంతా తిరిగారు. కొరటగెరె, మధుగిరి, సిరా తాలూకాల్లో ప్రచారం చేశారు. అవన్నీ వొక్కళిగలకు పెట్టని కోటలే.
ఏ ఒక్క వొక్కళిగ ఓటునీ వదులుకోకూడదని ఆయన సంకల్పం చెప్పుకున్నారు. అందుకే మైసూరు ప్రాంతం మీద తన పూర్తి శక్తియుక్తులు కేంద్రీకరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి వరుసగా వచ్చిన అన్ని ఎన్నికల్లోనూ ఆ కమ్యూనిటీ నుంచి ఆయనకు ఇసుమంతయినా మద్దతు దొరకలేదు. అది ఆయనకు ఒక పీడకలగా మారింది. రాజకీయ పట్టుదలకు వయస్సుతో నిమిత్తం లేదని దేవెగౌడ మరోసారి భారతదేశ రాజకీయ నాయకులకు ఇలా గట్టి సందేశం పంపుతున్నారు.