Friday, November 22, 2024

చెర్నిహిమ్‌, మెలిటోపోల్‌లోనూ విధ్వంసం..

ఉక్రెయిన్‌ ఉత్తరాన ఉన్న చెర్నిహవ్‌ను కూడా రష్యా బలగాలు చుట్టుముట్టి బాంబుల మోత మోగిస్తున్నాయి. ఆ నగరంలో నీరు, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఉక్రెయిన్‌లో మూడవ అతిపెద్ద నగరమైన ఒడెస్సాలోనూ రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ దాడుల్లో ఒక కేన్సర్‌ ఆసుపత్రి కూడా తీవ్రంగా దెబ్బతింది. కాగా, మరియుపోల్‌లో అతిపెద్దదైన మసీదు బాంబుల తాకిడికి దెబ్బతిందని, ఇందులో పిల్లలు, వృద్ధులతో సహా 80 మంది తలదాచుకున్నారని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ తెలిపింది. ఇక్కడి ప్రజలు తాగడానికి నీళ్లులేక మంచును కరిగించుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దక్షిణ ఉక్రెయిన్‌లోని మెలిటొపోల్‌ను అధీనంలోకి తీసుకున్న రష్యా సైనికులు.. శుక్రవారం ఆ నగర మేయర్‌ను కిడ్నాప్‌ చేశారు. ఇందుకు సంబంధిం చిన దృశ్యాలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చాయి.

ఆయుధాలతో వచ్చిన కొంతమంది మెలిటొపోల్‌ మేయర్‌ ఇవాన్‌ ఫెడోరోవ్‌ను బలవంతంగా తీసుకెళ్తున్న వీడియోను ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం డిప్యూటీ హడ్‌ కిరిల్‌ తిమోషెంకో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. శత్రు సైనికులకు సహకరించట్లేదని అయనను అపహరించినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. ఈ కిడ్నాప్‌ను అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ధ్రువీకరించారు. ”రష్యా ఉగ్రవాదం కొత్త దశలోకి మారింది. చట్టబద్ధ ప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడుతోంది. ఈ చర్యలు ఐసిస్‌ ఉగ్రవాదుల కంటే తక్కువేం కాదు” అని జెలెన్‌స్కీ మండిపడ్డారు. కాగా రష్యన్‌ సేనల ఆధీనంలోకి వచ్చిన తొలినగరం మెలిటొపోల్‌.

79 మంది చిన్నారులు మృతి..

నివాస ప్రాంతాలపై రష్యా దాడుల కారణంగా ఇప్పటివరకు 79 మంది చిన్నారులు మృత్యువాత పడినట్లు ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. 100 మందికి పైగా చిన్నారులు గాయపడినట్లు తెలిపారు. రష్యా దండయాత్రలో భాగంగా నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులపైనా బాంబులు కురిపిస్తోంది. ఇప్పటివరకూ 202 పాఠశాలలు, 34 ఆసుపత్రులు, 1,500 నివాస భవనాలు ధ్వంసమయ్యాయి.

షోల్జ్‌, మేక్రాన్‌ చర్చలు..

- Advertisement -

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపేందుకు జర్మనీ చాన్స్‌లర్‌ ఓలఫ్‌ షోల్జ్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ రంగంలోకి దిగారు. వీరిద్దరితో పుతిన్‌ గురువారం మాట్లాడిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా శనివారం మరోదఫా సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపాలని, ఆదేశంతో చర్చలు జరపాలని షోల్జ్‌, మేక్రాన్‌ ఇద్దరూ పుతిన్‌ను కోరారని క్రెవ్లిున్‌ అధికార ప్రతినిధి దిమిత్ర పెస్కోవ్‌ రష్యన్‌ వార్తాసంస్థలకు తెలిపారు. ఈ యుద్ధాన్ని నిలువరించేందుకు దౌత్య పరిష్కారం అవసరమని వారు సూచించారని అన్నారు. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని రష్యాను విజ్ఞప్తి చేసినట్లు జర్మన్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement