ఈ మధ్య కాలంలో రైళ్లు తరుచూ ప్రమాదానికి గురవుతున్నాయి. అధికారులోపమో లేదా సాంకేతిక లోపమో గానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లో సోమవారం తెల్లవారు జామునా సబర్మతీ-ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.
గుజరాత్‌లోని సబర్మతి నుంచి యూపీలోని ఆగ్రాకు వెళ్తోన్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రైస్ సోమవారం తెల్లవారుజామున రాజస్థాన్‌లోని అజ్మేర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. మాదర్ రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామునా రైలు ఇంజిన్‌తో పాటు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి తామంతా గాఢ నిద్రలో ఉండా పెద్ద శబ్దం వినిపించిందని, చివరకు రైలు పట్టాలను తప్పినట్టు తెలిసిందని కొందరు ప్రయాణికులు మీడియాకు తెలిపారు.
కాగా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సుకు చెందిన సహాయబృందాలు, రైల్వే పోలీసులు, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్, ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్థలంలోనే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. పట్టాలు తప్పిన బోగీలను మళ్లీ చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.