Friday, October 4, 2024

TG | విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరిన ఉప ముఖ్యమంత్రి భట్టి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విదేశీ పర్యటన ముగించుకుని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. అమెరికా, జపాన్‌ దేశాల్లో 13 రోజుల పాటు అధికారులతో కలిసి పర్యటించి వచ్చిన భట్టికి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చి స్వాగతం పలికారు. అమెరికాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్‌ ఎగ్జిబిషన్‌(మైనెక్స్‌-2024)లో కోమత్సు, హట్యాచి, క్యాటర్‌ పిల్లర్‌ వంటి ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి చేసిన అత్యాధునిక షావెల్స్‌, డంపర్లు, కంటిన్యూయస్‌ మైనర్‌ యంత్రాలు, గనిలో ప్రమాదాలు జరగకుండా చూసే రక్షణ వ్యవస్థలను భట్టి బృందం పరిశీలించింది.

ఆధునిక గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి పద్ధతులు, బొగ్గు ఉత్పత్తిలో భద్రత, ఆధునిక సాంకేతికతలను అయన పరిశీలించారు. అంతర్జాతీయంగా ఉనికిలోకి వచ్చిన అత్యాధునిక గ్రీన్‌ ఎనర్జీ టెక్నాలజీలు, ఆధునిక మైనింగ్‌ విధానంలో అధికోత్పత్తిని సాధించే భారీ యంత్రాలు, వర్చువల్‌ రియాలిటీతో రక్షణ చర్యలు మొదలైన వాటిని ఆయన పరిశీలించారు.

భూగర్భ గనుల్లో వర్చువల్‌ రియాలిటీ ద్వారా గని వెలుపలే ఉండి లోపల బొగ్గును తవ్వే సాంకేతికత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అమెరికాలో అతిపెద్ద హోవర్‌ జల విద్యుత్‌ డ్యామ్‌ను సందర్శించి జల విద్యుత్‌ ఉత్పత్తి విధానాలు, రక్షణ చర్యలు తెలుసుకున్నారు.

జపాన్‌ పర్యటనలో యమనాషీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌ కేంద్రంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ను పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి వినియోగించే సాంకేతికతను, సోలార్‌ విద్యుత్తును నిలువ ఉంచే ఫ్యూయల్‌ సెల్స్‌ టెక్నాలజీని పరిశీలించారు. తోషిబా పరిశ్రమలను సందర్శించి అక్కడ ఉత్పత్తి అవుతున్న అత్యాధునిక ఫోటో వోల్టాయిక్‌ మాడ్యూల్స్‌ తయారీ టెక్నాలజీపై అక్కడి నిపుణులను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

రోహ్మ్‌ సెమీ కండక్టర్ల పరిశ్రమను సందర్శించి అక్కడ జరుగుతున్న పలు రకాల సెమీకండక్టర్‌లు, హై-ఎఫిషియన్సీ బ్యాటరీలు, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ సెమీకండక్టర్లు వంటివి పరిశీలించారు. జపాన్‌ రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న బుల్లెట్‌ ట్రైన్‌లో ఆయన స్వయంగా ప్రయాణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement