న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన శ్రవణ్ దాసోజు నేడు కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఉదయం 8 గంటలకు న్యూఢిల్లీలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ నివాసంలో ఆయన సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. శనివారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేదుకు ఢిల్లీ వచ్చిన బండి సంజయ్‌తో కలిసి దాసోజు శ్రవణ్ తరుణ్ చుగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. అనంతరం తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ… తమ ద్యార్థి పరిషత్‌లో పనిచేసిన శ్రవణ్ బీజేపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించామని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం దోచుకుంటోందని, ప్రజల ఆశలను టీఆర్‌ఎస్ వమ్ము చేస్తోందని విమర్శించారు. బండి సంజయ్ నాయకత్వంలో ప్రజా సంగ్రామ యాత్ర, మోటార్ సైకిల్ యాత్రలు నడుస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ నేతలు శ్రవణ్‌పై వేలెత్తి చూపలేరన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలు గుడ్‌బై చెప్పనున్నారన్న తరుణ్ చుగ్, త్వరలోనే కేసీఆర్ అధికారాన్ని కోల్పోతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ కూడా అదే చెబుతోందని వెల్లడించారు. శ్రవణ్ చేరిక ట్రయల్ మాత్రమేన్న ఆయన ఇది ట్రయల్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.
అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ… డబ్బులిచ్చి నేతలను చేర్చుకునే సంస్కృతి బీజేపీది కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రాజగోపాల్ రెడ్డి, శ్రవణ్‌లు ఎందుకు పార్టీ మారుతున్నారో అర్ధం చేసుకోవాలన్నారు. సోనియాను తిట్టిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని బండి సంజయ్ చెప్పారు.