Thursday, November 21, 2024

ఆ ఫండ్స్​ని ఎస్డీఆర్ఎఫ్ ఖాతాల్లో జమచేయండి.. ఏపీ సర్కారుకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దారిమళ్లించిన రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్)ని వెనక్కి ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రూ. 1,100 కోట్ల మేర ఎస్డీఆర్ఎఫ్ ఖాతాల్లోని నిధులను దారిమళ్లించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టిన ఎం.ఆర్ షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం, రెండు వారాల్లోగా ఆ నిధులను వెనక్కి ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. నిధులు వెనక్కి ఇచ్చే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తీసుకుంటామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి చెప్పగా, అభిప్రాయం

అవసరం లేదని, దారిమళ్లించిన నిధులను ఎస్డీఆర్ఎఫ్ ఖాతాల్లోకి జమచేయాలంటూ తామే ఆదేశాలిస్తున్నామని స్పష్టం చేసింది. మళ్లించిన నిధులను వెనక్కి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ఇందుకు కొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. గత విచారణ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ ఖాతాల నుంచి నిధులను వ్యవసాయ కమిషనరేట్ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నిధుల వినియోగం విషయంలో కాగ్ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉండడంతో సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement