న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మంగళవారం దంత వైద్యం చేయించుకున్నారు. సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన, మంగళవారం సాయంత్రం నిజాముద్దీన్ ఈస్ట్‌లో ఉన్న డెంటిస్ట్ డా. తాన్యా కుమార్ క్లినిక్‌కు వెళ్లారు. సోమవారం ఢిల్లీ పర్యటనకు బయల్దేరే ముందు ఈ పర్యటనలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు జాతీయ పార్టీ నేతలను కలుస్తారని ప్రచారం జరిగింది. అయితే మంగళవారం ఆయన ఉదయం నుంచి ఎటూ వెళ్లకపోగా, కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో లేరని, బెంగళూరు వెళ్లారని తెలిసింది. సీఎం ఢిల్లీ పర్యటన గురించి తెలంగాణ భవన్ అధికారులను సంప్రదించగా, వ్యక్తిగత పర్యటనలో భాగంగా కుటుంబ సభ్యులతో పాటుగా కేసీయార్ ఢిల్లీ వచ్చారని ఓ అధికారి వెల్లడించారు.
అధికారికంగా ప్రధాన మంత్రి లేదా కేంద్ర మంత్రులతో ఎలాంటి అపాయింట్మెంట్లు కోరలేదని తెలిపారు. గత నెలలో కేసీయార్ ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కలవడంతో తాజా ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన కేసీయార్, కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, స్టాలిన్‌తో సంప్రదింపులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటనలో కేజ్రీవాల్‌తో సమావేశమవుతారని విస్తృతంగా చర్చ జరిగింది. కానీ అటు సీఎం కార్యాలయ వర్గాలుగానీ, ఇటు పార్టీ వర్గాలుగానీ కేజ్రీవాల్‌తో భేటీని ధృవీకరించడం లేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..