హైదరాబాద్, ఆంధ్రప్రభ : కరోనా వైరస్ బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్ర ప్రజలను డెంగీ బెంబేళెత్తిస్తోంది. ఇప్పుడు డెంగీ కారణంగా మెదడు వాపు వ్యాధి కూడా వ్యాపిస్తోంది. అసలే ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. డెంగీ బారిన చిన్నారులు ఎక్కువగా పడుతుండడం ఆందోళన కలగిస్తోంది. అదే సమయంలో చిన్నా పెద్ద తేడా లేకుండా పెద్దసంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.
ఇప్పుడు ఏకంగా డెంగీ మెదడువాపు కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఇటీవల డెంగీతో రాష్ట్రంలో ఓ వైద్య విద్యార్థి డెంగీ మెదడువాపుతో మృతిచెందడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సాధారణంగా డెంగీ ఎన్సెఫాలిటిస్ (మెదడువాపు) ఏడెస్ దోమల కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. ఇది కూడా డెంగీనే . కానీ డెంగీ వైరస్ మెదడుకు చేరుకుంటే డెంగీ ఎన్సెఫాలిటిస్ అంటారు.
ఈ వైరస్ మెదడులోకి వెళ్లిన కాసేపటికే మెదడులోని ప్రధాన భాగాలు వాచిపోతాయి. సకాలంలో వైద్య చికిత్సతో బతికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తీవ్రమైన తలనొప్పి, గందరగోళం, మూర్ఛతో పాటు- నాడీకి సంబంధించి ఏదైనా తీవ్రమైన సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్థితుల్లో వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఆలస్యం చేస్తే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఒక్క మెదడువాపు కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా జీడిమెట్లలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో రెండు కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజుల క్రితం మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్న జూనియర్ డాక్టర్ గోపి డెంగీ మెదడువాపుతో మరణించాడు. మరో 16ఏళ్ల యువతికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
జపనీస్ ఎన్ సెఫలైటిస్ దోమ కాటుతో డెంగ్యూ వైరస్లు వ్యాప్తి చెందుతాయని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, దోమల నివారణ కార్యక్రమాల ద్వారా ఈ జబ్బుల బారి నుండి కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలకు సకాలంలో టీకాలు వేయించటం వల్ల కూడా కొన్ని రకాల మెదడు వాపు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చంటున్నారు.
మరోవైపు వైద్యాధికారులు మాత్రం డెంగీ మెదడువాపు కేసులు తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు.
తీవ్రమైన డెంగీ కేసులు ఒక్క శాతం మాత్రమే రికార్డువుతున్నాయంటు-న్నారు. అటు- తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాస్ దీనిపై స్పందించారు. డెంగీ వైరస్‌లో ఎలాంటి మార్పులు రాలేదన్నారు. చాలా ఏళ్లుగా డెంగీ మెదడువాపు కేసులు కనిపించలేదన్నారు. అయితే కొన్ని తీవ్రమైన కేసులు నమోదైన విషయం నిజమేనన్నారు. దీనికి ‘లాంగ్ కోవిడ్’ కూడా కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు.