Saturday, November 23, 2024

TS | డెంగీ డేంజర్‌ బెల్స్‌.. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆగస్టు నెలలో రోజుకు సగటున వంద మందికి పైగా దీని బారిన పడ్డట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డెంగీ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ప్రైవేట్‌ ఆసుపత్రులలో నమోదవుతున్న కేసులు చాలా వరకు ప్రభుత్వం దృష్టికి రావడం లేదని అధికారులు అంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డెంగీ కారక దోమ వృద్ధి చెందడంతో గత నెల నుంచి కేసులు భారీగా పెరిగాయి.

ఇదిలా ఉండగా రోజురోజుకూ పెరిగిపోతున్న డెంగీ కేసులతో ఆసుపత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒకే వారంలో 120 డెంగీ కేసులు నమోదయ్యాయి. , రాష్ట్రవ్యాప్తంగా 182 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులలో అధిక శాతం గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాలలో ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రతపై సరైన అవగాహన లేకపోవడం ఈ వ్యాధి బారిన పడినప్పటికీ సరైన వైద్య చికిత్సలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం వంటికి ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొంటున్నారు.

- Advertisement -

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఒక్క పినపాక నియోజకవర్గంలో ఒక నెల వ్యవధిలో దాదాపు 10 మంది డెంగ్యూ జ్వరంతో మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. సాధారణంగా డెంగీ జ్వరాల ప్రభావం ప్రతీ మూడు నాలుగేళ్లకోసారి ఎక్కువగా ఉంటుందనీ, ఈ ఏడాది ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. తీవ్ర నీరసం, జ్వరం తగ్గకపోవడం, కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలనీ, వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఈనెల మూడు, నాలుగు వారాల్లో డెంగీ కేసులు ఇంకా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందనీ, అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, ఇంట్లో వాడే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడగడం వంటి జాగ్రత్తలు పాటిస్తే డెంగీ జ్వరం రాకుండా ఉంటుందన్నారు. డెంగీ జ్వరం బారిన పడ్డ బాధితులు వైద్యుని సంప్రదించి తగిన మందులు వాడినప్పటికీ తగ్గని పక్షంలో వెంటనే ప్లేట్‌లెట్‌ కౌంట్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో మలేరియా, డెంగీ కేసులు నమోదైతే బాధితులకు తక్షణమే వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలనిమంత్రి హరీష్‌ రావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఓపీ సేవలు పెంచాలనీ, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి సేవలు అందించాలని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement