హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న డెంగీ జ్వరం చిన్నారులపై పంజా విసురుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ప్రతీ వారం కనీసం నలుగురైదుగురు చిన్నారులు డెంగీతో అడ్మిట్ అవుతున్నారు. చిన్నారులు డెంగీ బారిన పడితే వారు ఎక్కువ రోజులు జ్వరంతో బాధపడాల్సి వస్తోందని పీడియాట్రిషియన్ వైద్యులు చెబుతున్నారు. డెంగీ సోకిన చిన్నారులు చాలా రోజుల వరకు మంచం పడుతుండడంతో ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచిస్తున్నారు. డెంగీ బారిన పడిన చిన్నారులు చాలా రోజులు జ్వరంతో బాధపడడంతోపాటు వాంతులు, తలనొప్పి, జలుబు, ఒంటినొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో దోమ కాటు పెరగడంతో చాలా మంది చిన్నారులు డెంగీ లేదా డెంగీ తరహా జ్వరంతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని, వీరిలో 30శాతం మందిని ఆసుపత్రుల్లో అడ్మిట్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంకుర ఆసుపత్రుల పీడియాట్రిషన్ విభాగం చెబుతోంది. అయితే జ్వరంతో వస్తున్న చిన్నారుల్లో ఎక్కువ మందిని ఓపీలోనే వైద్యం అందిస్తున్నామని, ఒక 10శాతం చిన్నారులకు మాత్రం పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందించాల్సి వస్తోందంటున్నారు.
ఉన్న ఫళాన జ్వరం వచ్చి ఒక్కసారిగా శరీర ఉష్ణోగ్రత 103 నుంచి 105 ఫారి న్ హీట్ డిగ్రీలకు వె ళ్లడంతోపాటు తలనొప్పి, ఒంటి నొప్పులు , కంటి కింద వాపు, కండరాల వాపు, నొప్పి, శరీరంపై దద్దుర్లు ఉంటే దాన్ని డెంగీగా భావించి వెంటనే చిన్నారులను ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. డెంగీ వ్యాధి ప్రధాని ఎడిస్ దోమకాటుతోనే వస్తుందని, ఈ పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడంతోపాటు చెత్తా చెదారం పోగుకాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.