Saturday, November 23, 2024

నియంతృత్వంపై ప్రజాస్వామ్యం గెలుపు.. ఎమర్జెన్సీని ఎదురొడ్డి నిలిచిన పౌరులు

దేశంలో కొందరు నేతల నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విధానాన్ని విశ్వసించిన ప్రజలు సాహసోపేత పోరాటం చేశారని, ప్రజాస్వామ్య స్పూర్తితో ఓడించారని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు. ఏళ్ల తరబడి దేశ ప్రజల్లో నరనరానా జీర్ణించుకుపోయిన ప్రజాస్వామ్య విలువలవల్ల, అదే మార్గంలో నియంతృత్వ విధానాలపై పోరాడి విజయం సాధించగలిగారని అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాచి, అనేక దారుణాలకు కారణమైన అత్యయిక స్థితిని రద్దు చేసే వరకు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు చివరివరకు పోరాడారని గుర్తు చేశారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని.. భారత చరిత్రలో చీకటిఘట్టంగా అభివర్ణించిన ప్రధాని, ప్రజల వీరోచిత పోరాటంవల్ల నియంతలు తలవంచక తప్పలేదని అన్నారు. ప్రతినెల ప్రసారమయ్యే ప్రధానమంత్రి మోడీ మన్‌ కీ బాత్‌లో భాగంగా ఆదివారంనాడు 90వ ప్రసంగంలో ఆయన ఎమర్జెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీని ఎదిరించి పోరాడినవారి పటిమను ప్రశంసించిన ప్రధాని చీకటిరోజుల తరువాత కూడా ప్రజలకు ప్రజాస్వామ్యం విశ్వాసం ఏమాత్రం సడలిపోలేదని గుర్తు చేశారు. దేశ అంతర్గత సవాళ్లను ఎదుర్కొనే నెపంతో 1975 జూన్‌ 25వ తేదీ అర్ధరాత్రి అప్పటి ప్రభుత్వం అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. కాగా ఆదివారం ప్రసారమైన మన్‌ కీ బాత్‌లో ఆ విషయంపై ప్రధాని ప్రసంగిస్తూ ఎమర్జెన్సీ రోజుల్లో ప్రజల అన్ని హక్కులను ప్రభుత్వం కాలరాచిందని, రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్‌ ప్రసాదించిన జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛను దెబ్బతీసిందని అన్నారు. ఈ పాతికేళ్ల వయస్సున్న యువతీయువకులకు ఓ ప్రశ్న వేస్తున్నానన్న ఆయన దాని గురించి తీవ్రంగా ఆలోచించాలని సూచించారు.

మీ తల్లిదండ్రులు మీలా పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు.. వారు జీవించే హక్కును కోల్పోయారని గుర్తు చేశారు. వారికి స్వేచ్ఛ అనేది లేకుండా పోయిందని, అది నమ్మాల్సిన నిజమని చెప్పారు. అలాంటి చీకటి రోజులు మన దేశంలో 1975 జూన్‌లో మొదలైనాయని, ప్రజాస్వామ్యాన్ని చిదిమివేయడానికి అప్పట్లో ఎన్నో ప్రయత్నాలు జరిగాయని అన్నారు.దేశంలో కోర్టులు, పత్రికలు, వ్యవస్థలన్నింటిపైనా సెన్సార్‌ పేరుతో ఆంక్షలు అమలు చేశారన్న ఆయన ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ విషయమూ ప్రసారమయ్యేదికాదని, ప్రచురణకు నోచుకునేవి కావని అన్నారు. చివరకు ప్రఖ్యాత గాయకుడు కిశోర్‌కుమార్‌కూ ఎమర్జెన్సీ కష్టాలు తప్పలేదని అన్నారు. ప్రభుత్వాన్ని కీర్తిస్తూ పాటలు పాడటానికి సుముఖత చూపలేదన్న అక్కసుతో రేడియోలో ఆయన పాటల ప్రసారంపై అప్పటి ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తనకు గుర్తుందని మోడీ తన ప్రసంగంలో చెప్పారు. ఎమర్జెన్సీపై ప్రజలు తిరగబడటాన్ని అదృష్టవశాత్తు తాను కళ్లారా చూశానని గుర్తు చేసుకున్నారు. నియంతృత్వంపై ప్రజాస్వామ్య విధానంలో పోరాడి, అద్భుతమైన విజయం సాధించిన ఘట్టం ఇదొక్కటేనని ఆయన అన్నారు. ఎమర్జెన్సీ చీకటిరోజులను ఎన్నటికీ మరచిపోకూడదని, ప్రత్యేకించి ఆజాదీకీ అమృతోత్సవం జరుపుకుంటున్న సమయంలో మన విజయాన్ని గుర్తుకుతెచ్చుకోవాలని సూచించారు. ఈ ఏడాది స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో వేడుకలు నిర్వహించు కుంటున్నాం… ఇది కేవలం విదేశీయులపై గెలిచినందుకు గుర్తుగా మాత్రమే కాదు. ఇది స్వాతంత్య్ర సాధనకు సంబంధించిన కథలను మాత్రమే చెప్పదు.. ఈ కాలంలో మనం ఎదుర్కొన్న కష్టనష్టాలను, విజయాలను స్మరిస్తూ పాఠాలు నేర్చుకుని ముందుకు సాగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందిరా హయాంలో 1975 జూన్‌ 25న విధించిన ఎమర్జెన్సీ 1977 మార్చి 21వ తేదీవరకు అమల్లో ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement