న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నీతి, నిర్భీతి, నిజాయితీ కలిగిన పత్రికాస్వేచ్ఛ ద్వారానే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ సంయమనం, సహనంతో వ్యవహరించాలని, తమపై వచ్చే నిర్మాణాత్మక, వాస్తవ విమర్శలను స్వీకరించాల్సిన అవసరముందని అన్నారు. బెంగళూరు ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి పత్రికాస్వేచ్ఛ అనేది స్వతంత్ర న్యాయవ్యవస్థ వంటిదని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రచార, ప్రసార సాధనాలపై ఉందని వ్యాఖ్యానించారు. పత్రికా స్వేచ్ఛపై జరిగే ఎలాంటి దాడైనా జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసేదేనని, ఇలాంటి ఘటనలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి అన్నారు.
భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పత్రికలు పోషించిన పాత్ర అనన్య సామాన్యమైనదన్న ఉపరాష్ట్రపతి, తదనంతరం కూడా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో పత్రికలు తమ పాత్రను సమర్థవంతంగా పోషించాయన్నారు. గతంలో జర్నలిజం ఓ పవిత్రమైన వృత్తిగా ఉండేదని వార్తాసేకరణే వారి ఏకైక వృత్తిగా ఉండేదన్న ఉపరాష్ట్రపతి, ఉత్తమమైన జర్నలిజం అంటే వివక్ష లేకుండా, వాస్తవాలను, విశ్వసనీయమైన అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావడమే అని అన్నారు. ఖాసా సుబ్బారావు, ఫ్రాంక్ మోరేస్, నిఖిల్ చక్రవర్తి, వంటి ఎందరో మంది పేరుమోసిన పత్రికా సంపాదకులు ఈ రంగానికి వన్నెతెచ్చారని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇలాంటి వారు వార్తలకు తమ అభిప్రాయాలను ఎప్పుడూ జోడించలేదన్నారు. వార్తలు, తమ అభిప్రాయాలను జోడించే విషయంలో లక్ష్మణరేఖను గీసుకుని దాన్ని గౌరవించేవారని గుర్తుచేశారు. ప్రజలకు వాస్తవాలను అందించే విషయంలో పాత్రికేయులు రాగద్వేషాలకు, వివక్షకు తావులేకుండా పనిచేయాలన్న ఉపరాష్ట్రపతి.. వార్తలకు అభిప్రాయాలను జోడించకుండా ప్రజలకు అందించాలన్నారు.
ఇలాంటి సమయంలో స్వీయ నియంత్రణ ద్వారా తమలోపాలను సరిదిద్దుకునే సామర్థ్యం మీడియాకు ఉందన్న ఉపరాష్ట్రపతి ఈ దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రజలకు సమాచారాన్ని ఇవ్వడంతోపాటు వారిని చైతన్య పరచడం, సాధికారత కల్పించడం అత్యంత అవసరమన్నారు. గత కొంత కాలంగా పాత్రికేయ విలువలు దిగజారుతున్న తీరుపట్ల ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ప్రభావం పెరగడం కూడా ఓ సమస్యగా మారిందన్నారు. ప్రత్యేకమైన అజెండాలతో వార్తలను అందించడం ద్వారా ఈ రంగంపై ప్రజల్లో విశ్వనీయత తగ్గిపోతోందన్న ఆయన.. మళ్లీ పాత్రికేయతకు పునర్వైభవం తీసుకొచ్చి ప్రజల పక్షం, ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభంగా తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
ప్రభుత్వాలను, ఇతర వ్యవస్థలను నిర్మాణాత్మకంగా విమర్శించాల్సిన అవసరం ఉందని.. దీన్ని మీడియా చక్కగా నిర్వర్తించాలన్నారు. కరోనా కాలంలో విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులందరికీ నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి, పాత్రికేయులు వ్యక్తిగత ఆరోగ్యంపైనా దృష్టిసారించాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ వంటి ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రజా ఉద్యమంగా మార్చడంలో పాత్రికేయులు పోషించిన పాత్రను కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రజలను చైతన్యపరిచే ప్రతి కార్యక్రమంలో మీడియా పోషించే పాత్రే అత్యంత కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు పి.సి.మోహన్, బెంగళూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె.సదాశివ షెనాయ్, ప్రధాన కార్యదర్శి హెచ్ వీ. కిరణ్, ఉపాధ్యక్షులు శ్యామప్రసాద్, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..