Friday, November 8, 2024

ఈ వేసవిలో 250 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌.. ప్రణాళికాబద్దమైన చర్యలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

అమరావతి, ఆంధ్రప్రభ : వేసవి దృష్ట్యా రానున్న రోజుల్లో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 250 మిలియన్‌ యూనిట్లను దాటుతుందని అంచనా వేస్తున్నామని, ఇది గతంకంటే అత్యధిక డిమాండ్‌గా ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు తెలిపారు. ఈక్రమంలోనే రాబోయే ఇంధన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలను రూపొందించి డిమాండ్‌ను సమర్ధవంతంగా అందుకునేందుకు అన్ని ఏర్పాట్లు- చేయాలని ఏపీ జెన్‌కో అధికారులకు సూచించారు. వేసవిలో పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి థర్మల్‌ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి కట్టు-దిట్టమైన చర్యలు చేపట్టాలన్నాపు.

శుక్రవారం ఆయన విద్యుత్‌ సౌధలో ఏపీజెన్‌కో జేఎండీగా, ట్రాన్స్‌కో ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏపీజెన్‌కో ప్రాజెక్టుల అభివృద్ధిపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను చేరుకునేలా థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల ఆధునీకరణపై దృష్టి సారిస్తానని, అందుకు తగ్గట్టుగా విద్యుత్‌ ఉత్పత్తి ఆప్టిమైజేషన్‌కు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఏపీ జెన్‌కో బొగ్గు క్షేత్రాల నుండి బొగ్గు సరఫరాతో సహా విద్యుత్‌ ఉత్పత్తిలో ఎటువంటి సమస్యలు తలెత్తినా వాటిని వెంటనే నివారించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని వెల్లడించారు. ఇంధన డిమాండ్‌ పెరగడం చాలా మంచి సంకేతమని, ఇది రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను సూచిస్తుందని అన్నారు.

ఇవే ప్రాధాన్యతలు..

మెరుగైన హీట్‌ రేట్‌తో సమర్థవంతమైన విద్యుత్‌ ఉత్పత్తిని ఉత్పత్తిచేయంచడం మరియు ఇంధన వనరుల ఆప్టిమైజేషన్‌ వంటివి తమ ప్రాధాన్యతలలో భాగమన్నారు. మెరుగైన ఇంధన తయారీలో భాగంగా ఉత్తమ పద్ధతులను అవలంబించడంతో పాటు కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తామన్నారు. విద్యుత్‌ ఉత్పత్తిలో మరియు అత్యధిక ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) నిర్వహణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా అవతరించేందుకు ఏపీజెన్‌కో అన్ని ప్రయత్నాలు చేస్తుందని కూడా ఆయన వెల్లడించారు. ఆప్టిమైజ్‌ చేయబడిన విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 24/7 నాణ్యమైన, నమ్మదగిన మరియు తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్‌ సరఫరాను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని జెన్‌కో పని చేస్తుందని తెలిపారు. థర్మల్‌ ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సిబ్బంది అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

పెరుగుతున్న డిమాండ్‌ను చేరుకోవడమే తక్షణ కర్తవ్యం..

గ్రిడ్‌ను సమతుల్యం చేయడానికి మరియు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి థర్మల్‌ ఉత్పత్తి సామర్థ్యాలను వేగవంతం చేయడం తక్షణ అవసరంగా ఆయన పేర్కొన్నారు. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. అదృష్టవశాత్తూ, విద్యుత్‌ శాఖలోని థర్మల్‌ మరియు ఇతర రంగాలపై దశాబ్ద కాలంగా అపారమైన అనుభవంతో ఈ రంగానికి నాయకత్వం వహిస్తున్న కే విజయానంద్‌ ఎనర్జీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా ఉన్నారని, ఇది ఏపీజెన్‌కో లక్ష్యాలను చేరుకోవడంలో తమకెంతో సహాయపడుతుందని అన్నారు. విద్యుత్‌ రంగంలో మళ్లీ సేవ చేయడం తనకు చాలా సంతృప్తిగా ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరిస్తోందన్నారు. కాబట్టి, అసోసియేషన్‌లు మరియు సంస్థలోని ప్రతి ఉద్యోగి, వినియోగదారుల సహాయ సహకారాలతో ఏపీజెన్‌కోని బలోపేతం చేయడానికి కట్టుబడి పనిచేస్తామన్నారు. ఏపీజెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌లకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

జెన్‌కో సమార్ధ్యమిలా..

శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ స్టేజ్‌-2లో (రెండు 800 ఎండబ్ల్యూ) ప్రస్తుతం పనిచేస్తోందని, వేసవి డిమాండ్‌ను తీర్చేందుకు ఇది దోహదపడుతుందని జెన్‌కో అధికారులు వివరించారు. డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో మరో 800 మెగావాట్ల యూనిట్‌ ఈ ఏడాదిలో పనిచేయనుందని వివరించారు. గ్రిడ్‌ డిమాండ్‌లో ఏపీజెన్‌కో 40 నుండి 45 శాతం వరకు సహకరిస్తోందని పేర్కొన్నారు. ఏపీజెన్‌కో పోలవరం వద్ద 80 మెగావాట్ల సామ్యర్థమున్న 12 హైడ్రో ఎలక్ట్రిక్ర్‌ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తోందని, వీటిలో మొదటి 7 యూనిట్లు 2024-25 ఆర్ధిక సంవత్సరంలోనూ మిగిలిన యూనిట్లను 2025-26 ఆర్ధిక సంవత్సరంలోనూ ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.

గ్రీన్‌ ఎనర్జీలో సామర్థ్య జోడింపులో భాగంగా, దిగువ సిలేరు వద్ద 115 మెగావాట్ల 2 అదనపు యూనిట్లను ఏర్పాటు చేయాలని జెన్‌కో యోచిస్తోందని, ఇది జూలై 2024 నాటికి విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ఏపీజెన్‌కో ఎండీగా నియమితులైనందుకు జెన్‌కో డైరెక్టర్లు చంద్రశేఖరరాజు, బీ వెంకటేశులు రెడ్డి, ఆంటోని రాజా, ఎంవీవీ సత్యనారాయణ మరియు సయ్యద్‌ రఫీ అభినందనలు తెలిపారు.

చక్రధర బాబు ట్రాక్‌ రికార్డు ఇలా..

చక్రధర బాబు ఇంతకు ముందు శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌గా, ఏపీ ట్రాన్స్‌కోలో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల కలెక్టరుగా పనిచేశారు. కోవిడ్‌-19 రెండు దశల్లోతోపాటు అనేక తుఫానులను సమర్ధవంతంగా ఎదుర్కొనడంతోపాటు వివిధ హోదాలలో విశేషమైన పని చేసారు. నీటి నిర్వహణలో ఆయన కొన్ని కీలక చర్యలు తీసుకున్నారు. నేషనల్‌ ఇ-గవర్నెన్స్‌ అవార్డు, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఎక్సలెన్స్‌ అవార్డు, పీఎం కిసాన్‌ యోజన అమలులో ఉత్తమ జిల్లాగా జాతీయ అవార్డు, పీఎంఏజీవై అమలులో ఉత్తమ జిల్లాగా జాతీయ అవార్డు మరియు ఆదర్శ్‌ పంచాయతీలకు జాతీయ అవార్డు మొదలైనవి అందుకున్నారు.

ఇటీవల, నెల్లూరు బ్యారేజీ మరియు సంగం బ్యారేజీలను నిర్మించడం ద్వారా పెన్నార్‌ డెల్టా వ్యవస్థను ఆధునీకరించడం మరియు ఇతర ఆధునీకరణ పనులను అమలు చేయడం కోసం జిల్లా మేజిస్ట్రేట్‌ మరియు నెల్లూరు కలెక్టర్‌ క్యాడర్‌లో కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి నుండి ప్రతిష్టాత్మకమైన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ (సీబీఐపీ) అవార్డును అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement