Friday, November 22, 2024

తెలంగాణలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్ కేసులు

తెలంగాణలో కరోనా టెన్షన్ మళ్లీ మొదలైంది. అయితే తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా డెల్టా వేరియంట్‌ రకానివే ఉన్నట్లు స్పష్టమైంది. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం నుంచి నమోదైన కేసుల్లో ఎక్కువ డెల్టా రకం వైరస్‌కు చెందినవేనని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో రోజురోజుకూ డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసుల శాంపిళ్లను శాస్త్రవేత్తలు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేశారు. జులై, ఆగస్టుల్లో కొవిడ్‌ను విశ్లేషించినప్పుడు ఈ రకం కేసులు 95 శాతంగా ఉన్నట్టు తేలింది. ఏప్రిల్‌లో నమోదైన కేసుల్లో డెల్టా రకం 33 శాతం ఉండగా.. మేలో 84, జూన్‌లో 86, జులైలో 95 శాతానికి పెరిగింది.

ప్రధానంగా జగిత్యాల, జనగామ, మహబూబాబాద్‌, మంచిర్యాల, మేడ్చల్‌ మల్కాజిగిరి, ములుగు, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, వనపర్తి, వరంగల్‌ నగర జిల్లాల్లో నమోదైన కేసులన్నీ డెల్టా రకంవేనని నిర్ధారించారు. హైదరాబాద్‌లో నమోదైన మొత్తం కేసుల్లో 94 శాతం, జోగులాంబ గద్వాల జిల్లాలో 93, సూర్యాపేట జిల్లాలో 86 శాతం డెల్టా వేరియంట్ కేసులు నమోదైనట్లు శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు డెల్టా ప్లస్‌ రకం వైరస్‌ కేసులు గుర్తించినా.. వాటి ప్రభావం తక్కువేననీ వైద్యవర్గాలు విశ్లేషించాయి. దీనికి సంబంధించిన అన్ని వివరాలను గ్లోబల్‌ ఇన్షియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జీఐఎస్‌ఏఐడీ)లో పొందుపరిచారు.

ఈ వార్త కూడా చదవండి: కడుపు నొప్పితో వచ్చిన వ్యక్తిని కాటికి పంపిన ఆస్పత్రి

Advertisement

తాజా వార్తలు

Advertisement