కరోనా వైరస్‌లోని మిగతా రకాలతో పోలిస్తే డెల్టా ప్లస్ వేరియంట్ ఊపిరితిత్తుల కణజాలంతో ఎక్కువగా పెనవేసుకుపోతోందని కొవిడ్-19 కార్యాచరణ బృందం (ఎన్‌టాగీ) అధిపతి ఎన్.కె.అరోడా తెలిపారు. అయితే దీన్నిబట్టి బాధితుల్లో ఇది తీవ్ర వ్యాధిని కలిగిస్తుందని గానీ, ఎక్కువ సంక్రమణ శక్తి కలిగి ఉంటుందని గానీ భావించలేమన్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. మరింత విస్తృతంగా కేసులు వెలుగు చూశాకే ఈ వేరియంట్ ప్రభావంపై ఒక అంచనాకు రావడానికి వీలవుతుందన్నారు. ఒకటి లేదా రెండు డోసుల మేర కొవిడ్ టీకా పొందినవారిలో ఈ రకం వైరస్ వల్ల స్వల్పస్థాయి వ్యాధి లక్షణాలే ఉంటున్నాయని చెప్పారు.
మూడు అంశాల ఆధారంగా మూడో ఉద్ధృతి
డెల్టా ప్లస్ వల్ల మూడో ఉద్ధృతి వస్తుందా అన్నది ఇప్పుడే చెప్పలేమని అరోడా పేర్కొన్నారు. ‘కొత్త వేరియంట్లు లేదా ఉత్పరివర్తనలకు కరోనా ఉద్ధృతులతో సంబంధం ఉంటోంది. డెల్టా ప్లస్ కూడా కొత్త రకమే కావడం వల్ల అందుకు అవకాశముంది. దీనివల్ల మూడో ఉద్ధృతి వస్తుందా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. మూడు అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. మొదట.. గత మూడు నెలల్లో భీకరస్థాయిలో రెండో ఉద్ధృతిని ఎదుర్కొన్నాం. అది ఇంకా కొనసాగుతోంది. ఈ పరిస్థితి కొత్త రకంపై ప్రజల స్పందనను ప్రభావితం చేస్తుంది. జనాభాలో ఎంతమంది.. రెండో ఉద్ధృతిలో కరోనా బారిన పడ్డారన్న దానిపై మూడో విజృంభణ ఆధారపడి ఉంటుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇప్పటికే ఇన్‌ఫెక్షన్ బారినపడి ఉంటే తదుపరి ఉద్ధృతిలో ప్రజలకు సాధారణ జలుబు లాంటి రుగ్మతలే కలగొచ్చు. ఇక రెండోది వ్యాక్సినేషన్. టీకాల కార్యక్రమంలో వేగం చాలా ముఖ్యం. కనీసం ఒక్క డోసు వేసినా ప్రయోజనం ఉంటుంది. అందువల్ల వ్యాక్సినేషన్ వేగంగా సాగితే మూడో ఉద్ధృతి ముప్పు తగ్గిపోతుంది. ఇక మూడోది.. ఇప్పటికే ఇన్‌ఫెక్షన్ బారినపడటం, టీకా పొంది ఉండటానికి తోడు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించడం వల్ల మనకు తదుపరి కరోనా విజృంభణ నుంచి రక్షణ లభిస్తుంది’ అని పేర్కొన్నారు.