అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుండగా పుట్టిన బిడ్డకు రాముడి పేరు కలిసి వచ్చేలా నామకరణం చేసిందో ముస్లిం జంట.. తమ బిడ్డకు ‘రామ్ రహీమ్’ అంటూ పేరు పెట్టింది. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ కు చెందిన ఫర్జానా సోమవారం మధ్యాహ్నం మగబిడ్డకు జన్మనిచ్చింది. దేశమంతా అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠ సంబరాల్లో మునిగి ఉండడం, ముహూర్త సమయంలోనే తనకు నార్మల్ డెలివరీ కావడంతో పుట్టిన బిడ్డకు రాముడి పేరు పెట్టుకున్నట్లు ఫర్జాన చెప్పింది.
రామమందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కోసం నిర్ణయించిన ముహూర్తం దివ్యమైందనే భావనతో దేశవ్యాప్తంగా పలువురు గర్భిణీలు పట్టుబట్టి సిజేరియన్ చేయించుకున్నారు. కొంతమందికి మాత్రం ముహూర్త సమయానికే నార్మల్ డెలివరీ అయింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోనే సోమవారం 25 మంది గర్భిణిలు ప్రసవించారు. ఇందులో 10మంది అమ్మాయిలు, 15మంది అబ్బాయిలు.. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అబ్బాయిలకు రాముడి పేరు, అమ్మాయిలకు సీత పేరు కలిసి వచ్చేలా పేర్లు పెట్టుకున్నారని వైద్యులు చెప్పారు.