Saturday, November 23, 2024

ఉద్దేశపూర్వక ఎగవేతలు రూ.92,570 కోట్లు..

ఉద్దేశపూర్వక ఎగవేత దారుల జాబితాలో పేరున్న టాప్‌-50 మంది నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తం రూ.92,570 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి భగవత్‌ కరాడ్‌ లోక్‌సభకు తెలిపారు. దేశం విడిచి పారిపోయిన నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీలకు చెందిన గీతాంజలి జెమ్స్‌ లిమిటెడ్‌, నక్షత్ర బ్రాండ్స్‌, గిలి ఇండియా లిమిటెడ్‌ల నుంచి రూ.10,444 కోట్లు వసూలు కావాల్సి ఉందన్నారు. ఎరా ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌ (రూ.5,879 కోట్లు), రే ఆగ్రో (రూ.4,803 కోట్లు), కాన్‌కాస్ట్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ (రూ.4,596కోట్లు), ఏబీజీ షిప్‌యార్డు (రూ.3,708 కోట్లు), ఫ్రాస్ట్‌ ఇంటర్నేషనల్‌ రూ.3,311 కోట్లు, విన్సమ్‌ డైమండ్‌ రూ.2,931 కోట్లు, రొటోమ్యాక్‌ గ్లోబల్‌ రూ.2,893 కోట్లు, జూమ్‌ డెవలపర్స్‌ రూ.2,147 కోట్లు వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

  • తెలుగు రాష్ట్రాలకు చెందిన కోస్టల్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ రూ.1890కోట్లు, ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.1932 కోట్లు, డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ రూ.1890 కోట్లు, ఐవీఆర్‌సీఎల్‌ లిమిటెడ్‌ రూ.1766 కోట్లు ఎగవేతకు పాల్పడినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.
  • గడచిన ఆరేళ్లలో రూ.11.17 లక్షల కోట్ల మేర రుణాలను బ్యాంకులు రైటాఫ్‌ చేశాయని మరో ప్రశ్నకు బదులిచ్చారు. దేశంలో బ్యాంకుల ఎన్‌పీఏలు గత ఐదేళ్లలో రూ.8.95 లక్షల కోట్ల నుంచి రూ.5.40 లక్షల కోట్లకు తగ్గాయని చెప్పారు. రుణాలు చెల్లించగలిగే శక్తి ఉన్నా, ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడే వారిని ఉద్దేశపూరిత రుణ ఎగవేత దారులుగా గుర్తిస్తారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, ఈ జాబితాలో ఉన్న వారికి ఐదేళ్లపాటు కొత్త రుణాలు మంజూరు చేయరు. అలాగే కొత్త వెంచర్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వరు.
  • ఎస్‌బీఐ 2021-22లో రూ.19,666 కోట్ల విలువైన మొండి బకాయిలను మాఫీ చేసింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.19,484 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రూ.18,312కోట్లు), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.10,443కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.10,148 కోట్లు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ రూ.9,405కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.9,126కోట్లు, ఇండియన్‌ బ్యాంక్‌ రూ.8,120 కోట్లు మాఫీ చేశాయి.
Advertisement

తాజా వార్తలు

Advertisement