మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భాగంగా ఇవ్వాల జరిగిన మ్యాచ్లో ఢిల్లీ గెలుపొందింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ముంబైపై 29 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. ముంబై ముందు 193 పరుగులు టార్గెట్ను సెట్ చేసింది.
అయితే ఛేజింగ్లో ముంబై ఇండియన్స్ టాపార్డర్ తడబడింది.. దీంతో ఆ జట్టు 68 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో జెస్ జోనాస్సెన్ 3, మారిజానే కాప్ 2 వికెట్లు తీయగా.. శిఖా పాండే, టిటాస్ సాధు, రాధా యాదవ్ చరో వికెట్ దక్కించుకున్నారు.
ఈ విజయంతో ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. అయితే ఈ ఓటమితో రెండో స్థానంలో ఉన్న ముంబై మూడో స్థానానికి పడిపోయింది.
ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాటింగ్లో రెచ్చిపోయింది.. కప్టెన్ మెగ్ లానింగ్ (53) అర్థ సెంచరీ సాధించగా.. జెమీమా రోడ్రిగ్స్ (69 నాటౌట్) దంచికొట్టింది. షఫాలీ వర్మ (28) పరుగులతో పరువాలేదనిపించింది. ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్, హేలీ క్రిస్టెన్ మాథ్యూస్ చరో వికెట్ తీసారు.