మహిళలపై నేరాలు తీవ్ర ఆందోళనకరం
సుప్రీంకోర్టుకు 75 ఏళ్లు పూర్తి
జాతీయ సమగ్రతను కాపాడుతున్న న్యాయ వ్యవస్థ
న్యాయవ్యవస్థ సదస్సులో ప్రసంగించిన ప్రధాని
స్మారక చిహ్నం స్టాంపును రిలీజ్ చేసిన మోదీ
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం జరగాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అలా జరిగితేనే మహిళల భద్రతకు మరింత భరోసానిస్తుందని అన్నారు. న్యాయవ్యవస్థను రాజ్యాంగాన్ని పరిరక్షుడిగా పరిగణిస్తున్నామని, సుప్రీం కోర్టు, న్యాయవవస్థ తమ బాధ్యతను నిర్వర్తించిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు లేదా న్యాయవ్వవస్థపై భారత ప్రజలు ఎప్పుడూ అపనమ్మకం చూపలేదని తెలిపారు. ఢిల్లీలోని భారత మండపంలో శనివారం నుంచి రెండ్రోజులపాటు జరుగుతున్న జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సదస్సులో ఈ మేరకు ప్రధాని మోదీ మాట్లాడారు. సుప్రీం కోర్టుకు 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్మారక చిహ్నం స్టాంప్‌ను విడుదల చేశారు.
జాతీయ సమగ్రతను కాపాడుతున్న న్యాయవ్యవస్థ
‘మన ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని కాపాడే సంరక్షుడిగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా స్వాతంత్య్రం తర్వాత న్యాయం అనే భావనను కాపాడింది. ఎమర్జెన్సీ వంటి చీకటి పరిస్థితులు వచ్చాయి. ఆ సమయంలో రాజ్యాంగ రక్షణలో కీలక పాత్ర పోషించింది. ప్రాథమిక హక్కులకు రక్షించింది. వాటితో పాటు జాతీయ ప్రయోజనాలకు సంబంధించి ప్రశ్న ఎదురైనప్పుడు సుప్రీం న్యాయస్థానం ఎప్పుడూ జాతీయ సమగ్రతను కాపాడుతూ వచ్చింది. మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయి. సత్వర న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది’ అని ప్రధాని మోదీ అన్నారు.