Tuesday, July 2, 2024

Delhi | విజన్‌ 2050 – తెలంగాణ సర్కార్‌ మాస్టర్‌ ప్లాన్‌

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విజన్‌ 2050 పేరుతో మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్టు వెల్లడించారు. గురువారం ఢిల్లిలోని ఆయన అధికారిక నివాసం 23, తుగ్లక్‌ రోడ్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, అనంతరం తెలుగు మీడియా ప్రతినిధులతో 3 గంటలకు పైగా సుదీర్ఘంగా ముచ్చటించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో తన ఆలోచనలు, ప్రణాళికలను పంచుకున్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఏమాత్రం రాజీ పడకుండా కఠినంగా వ్యవహిరిస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలో అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను సర్వీసు నుంచి తొలగించడానికి కూడా వెనుకాడడం లేదని చెబుతూ కొన్ని ఉదంతాలను ఉదహరించారు. గత పదేళ్ల కాలంలో అనేక వ్యవస్థలు కూలిపోయాయని, వాటి పునర్నిర్మాణమే తొలి ప్రాధాన్యంగా తాను అడుగులు వేస్తున్నానని రేవంత్‌ రెడ్డి తెలిపారు. వ్యవస్థల పునర్నిర్మాణంతో పాటు రాష్ట్రాభివృద్ధి కోసం సమర్థత, నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను జల్లెడ పట్టి వెతికానని చెప్పారు.

- Advertisement -

మొత్తం అధికారులను మూడు కేటగిరీలుగా వర్గీకరించానని, జనాన్ని పీడించుకు తినడమే పనిగా పెట్టుకుని బెదిరించి మరీ వసూళ్లకు పాల్పడే అధికారులను సీక్ఖేటగిరీలో చేర్చి, వారికి అవినీతికి ఆస్కారం లేని లూప్‌ లైన్‌ విభాగాల్లో బాధ్యతలను అప్పగించినట్టు చెప్పారు. మరికొందరు ”ఇస్తే తీసుకుందాం” అనుకునే రకం అధికారులను బీక్ఖేటగిరీలో చేర్చి అందుకు తగిన విభాగాల బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. ఇక అంకిత భావంతో పని చేసే సమర్థులైన అధికారులకు కీలక విభాగాల బాధ్యతల్ని అప్పగించినట్టు వెల్లడించారు.

రాజధాని మాస్టర్‌ ప్లాన్‌…

హైదరాబాద్‌ నగరాన్ని అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ ప్రాంతాలుగా సరిహద్దులు నిర్ణయించి వాటి అభివృద్ధికి తగిన ప్రణాళికలతో ముందుకెళ్తానని సీఎం రేవంత్‌ చెప్పారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలి వైపు ఉన్న నగరమంతా అర్బన్‌ ప్రాంతంగా గుర్తించి, ఆదాయ వనరులు సమానంగా పంచుతూ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ కమిషనరేట్లుగా మార్చనున్నట్టు తెలిపారు. పురపాలక వ్యవస్థ, పోలీస్‌ వ్యవస్థతో పాటు నగరానికి సంబంధంచిన అన్ని విభాగాలను ఇంటిగ్రేట్‌ చేస్తూ పూర్తి సమన్వయంతో పనిచేసేలా వ్యవస్థల్లో మార్పులు చేర్పులు చేయనున్నట్టు వెల్లడించారు.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ బౌండరీకి తగ్గట్టే పోలీస్‌ కమిషనరేట్‌ సరిహద్దులు నిర్ణయిస్తూ.. ప్రతి స్థాయిలోనూ అధికారులు సమన్వయంతో పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ పరిధిలోకి ట్రాఫిక్‌, డ్రైనేజీ సహా అత్యవసర సేవల విభాగాలను ఇంటిగ్రేట్‌ చేయనున్నట్టు వెల్లడించారు. అందుకే ఐజీ ర్యాంక్‌ ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌కు డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ బాధ్యతల్ని, ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి జీహెచ్‌ఎంసీ సహా నగరంలో కీలక విభాగాల బాధ్యతల్ని అప్పగించినట్టు చెప్పారు.

ఇకపై హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట మున్సిపల్‌ కార్పొరేషన్లు, పోలీస్‌ కమిషనరేట్లు మాత్రమే ఉంటాయని అన్నారు. జంట నగరాల్లో అండర్‌ పాస్‌లు, ఫ్లై ఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్‌ ఆటంకాలు లేకుండా చూస్తామన్నారు. ఔటర్‌రింగ్‌ రోడ్డుకు రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు మధ్య భాగాన్ని సెమీ అర్బన్‌ ప్రాంతంగా వర్గీకరించి, వివిధ పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఓఆర్‌ఆర్‌-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ఎక్కడికక్కడ రేడియల్‌ రోడ్లను కూడా నిర్మించి కనెక్టివిటీ మరింత పెంచనున్నట్టు వెల్లడించారు.

రోడ్లకు అవసరమైన మట్టి సేకరణ కోసం ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల సహజ ప్రవాహాలను గుర్తించి సుమారు 1,000 చెరువులు, సరస్సులు నిర్మించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. చెరువుల తవ్వకం ద్వారా వచ్చిన మట్టిని రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తామని అన్నారు. న్యూఢిల్లిలో ల్యూటెన్స్‌ ఢిల్లి (కోర్‌ క్యాపిటల్‌ ఏరియా)లో ఉన్న మాదిరిగా 7 రోడ్లు కలిసే జంక్షన్లను కూడా ట్రాఫిక్‌ సిగ్నల్‌ అవసరం లేకుండా నిర్మించాలన్నది తన ఆలోచనగా చెప్పారు. కొత్తగా విస్తరించే నగరం ప్రణాళికాబద్ధంగా ఉంటుందని అన్నారు. ఇందుకోసం ప్రపంచంలోని అత్యుత్తమ కన్సల్టెన్సీల సేవలను వినియోగించుకోనున్నట్టు చెప్పారు.

డ్రగ్స్‌తో యువతరం నిర్వీర్యం..

మాదక ద్రవ్యాల విషయంలో తాను కఠిన వైఖరి అవలంబించడానికి కారణం వాటి బారిన పడ్డ కుటుంబాల్లో చోటుచేసుకున్న విషాదాలేనని చెప్పారు. నక్సలిజం, ఉగ్రవాదం కంటే కూడా డ్రగ్స్‌ అత్యంత ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. డ్రగ్స్‌ తో దేశ భవిష్యత్తుగా ఉండాల్సిన యువతరం పూర్తిగా నిర్వీర్యమైపోతుందని అన్నారు. బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, మాదాపూర్‌ వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న పబ్స్‌ నుంచి మొదలుపెట్టి, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పోస్టుల వరకు.. ప్రతిచోటా మాదకద్రవ్యాలపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

ఇందుకోసం ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు జాగిలాలను కొత్తగా తీసుకుంటున్నామని తెలిపారు. సహజంగా మత్తులో ఉన్నవారు నేరాలకు పాల్పడుతూ ఉంటారని, అలాంటిది గంజాయి మత్తులో ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని సూత్రీకరించారు. నేరాలకు మూల కారణమైన డ్రగ్స్‌ భరతం పడితే.. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోకి వస్తాయని చెప్పారు. హైదరాబాద్‌ పాతబస్తీలో అర్థరాత్రి వరకు తెరిచి ఉంచే దుకాణాల కారణంగా గ్యాంగుల మధ్య ఘర్షణలు, కత్తిపోట్ల ఘటనలు ఎక్కువయ్యాయని, అందుకే వాటిని రాత్రి గం. 11.00కు మూయించేస్తున్నామని అన్నారు.

మహిళా సంఘాల చేతికి సోలార్‌ విద్యుత్తు…

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధి కమిటీలను రద్దు చేసి, వాటి నిర్వహణ బాధ్యతల్ని మహిళా సంఘాలకు అప్పగించినట్టు రేవంత్‌ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు అవసరమయ్యే దుస్తుల కాంట్రాక్ట్‌ కూడా మహిళా సంఘాలకే అప్పగించానని, తద్వారా వారికి ఉపాధి, విద్యార్థులకు సమయానికి దుస్తులు అందాయని అన్నారు. గతంలో పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి ఏనాడైనా దుస్తులు అందాయా అని ప్రశ్నించారు. అలాగే సౌర విద్యుత్తు ప్రాజెక్టులను కూడా మహిళా సంఘాలకే అప్పగించాలని భావిస్తున్నట్టు చెప్పారు.

తద్వారా వారికి ఉపాధి, ఆదాయంతో పాటు రాష్ట్ర అవసరాలకు తగిన విద్యుత్తు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. విద్యుత్తు కొనుగోలు విషయంలో సౌర, పవన, థర్మల్‌, జల విద్యుత్తు అంటూ వేర్వేరు ధరలతో వేర్వేరుగా కొనుగోలు చేయకుండా.. అది ఎలాంటి విద్యుత్తైనా సగటున తక్కువ ధరకు అందించే సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ పాతబస్తీలో వినియోగిస్తున్న విద్యుత్తులో 60 శాతం వరకే బిల్లులు వసూలవుతున్నాయని అన్నారు.

మిగతా 40 శాతం బిల్లులు కట్టకపోవడం, విద్యుత్‌ చౌర్యం వంటి కారణాలతో ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని అన్నారు. అందుకే అదానీ గ్రూపునకు పైలట్‌ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌ పాతబస్తీని అప్పగించి, అక్కడ 75 శాతం వసూల్‌ చేసి ప్రభుత్వానికి ఇచ్చినా చాలని చెప్పినట్టు రేవంత్‌ రెడ్డి అన్నారు. అక్కడ విద్యుత్‌ చౌర్యం నిరోధించడంతో పాటు నగర సుందరీకరణకు ఉపయోగపడేలా భూగర్భ విద్యుత్తు తీగల ద్వారా విద్యుత్తు సరఫరా చేసే బాధ్యత ఆ సంస్థ తీసుకుంటుందని, నిర్వహణ ఖర్చులన్నీ భరించాల్సి ఉంటుందని వివరించారు.

కాంగ్రెస్‌ పనితీరులో తెలంగాణయే భేష్‌

తెలంగాణలో అసెంబ్లి ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పనితీరు ఏ కోణంలో చూసినా మెరుగ్గానే ఉందని చెప్పారు. దేశంలోని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని 4 సీట్లలో కాంగ్రెస్‌ ఓడిపోయిందని, కర్ణాటకలోని 28 సీట్లలో కాంగ్రెస్‌ గెలుచుకున్నది కేవలం 9 మాత్రమేనని అన్నారు. ఈ రాష్ట్రాల్లో పనితీరు పేలవంగా ఉంది తప్ప తెలంగాణలో కాదని అన్నారు.

అసెంబ్లి ఎన్నికల్లో కంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పొందిన ఓట్ల శాతం ఎక్కువ అని సూత్రీకరించారు. అలాగే అసెంబ్లి ఎన్నికల్లో 64 సీట్లు గెలుచుకోగా, లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే.. 66 అసెంబ్లి సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యం వచ్చిందని చెప్పారు. గెలుపొందిన సీట్ల సంఖ్య ప్రకారం చూసినా సరే.. 2019లో 3 సీట్లు గెలుచుకోగా, ఈసారి 8 సీట్లు గెలుచుకున్నామని చెప్పారు.

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్‌ను ఓడించాలన్న లక్ష్యంతో డబ్బులు పంచి మరీ బీజేపీకి ఓటు వేయించారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. అందుకే బీజేపీ 8 సీట్లలో గెలుపొందగలిగిందని అన్నారు. మెదక్‌ నియోజకవర్గం మినహా బీఆర్‌ఎస్‌ డిపాజిట్లు కోల్పోయిన ప్రతి నియోజకవర్గంలో బీజేపీ గెలిచిందని అన్నారు. బీఆర్‌ఎస్‌ డిపాజిట్లు సాధించిన చోట కాంగ్రెస్‌ పార్టీయే గెలిచిందని తెలిపారు.

పీసీసీ సారథిగా ముగిసిన పదవీకాలం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా తన పదవీకాలం జులై 7తో ముగుస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. మూడేళ్ల పదవీకాలంలో పార్టీకి విజయాలు అందించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మెరుగైన సంఖ్యలో లోక్‌సభ సీట్లు అందించానని అన్నారు. తన పదవీకాలం ముగిసేలోగా కొత్త అధ్యక్షుణ్ణి ఎంపిక చేయాలని అధిష్టానం పెద్దలతో చెప్పానని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని అధిష్టానం తదుపరి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పీసీసీ చీఫ్‌ ఎంపికలో తన ప్రమేయం ఏదీ ఉండదని, అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎవరికి బాధ్యతలు అప్పగించినా తాను సమన్వయంతో పనిచేస్తానని అన్నారు. వీటితో పాటు అనేక రాజకీయ అంశాలపై కూడా రేవంత్‌ రెడ్డి మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement