Friday, November 22, 2024

Delhi | వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలి.. కేంద్రపెద్దలను కలిసిన కాంగ్రెస్ నేతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేసీఆర్ అధికారంలోకొచ్చి పది సంవత్సరాలైనా ఇచ్చిన హామీల నెరవేర్చకుండా వాల్మీకి బోయలను మోసం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి వాల్మీకి బోయిలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయని గుర్తు చేశారు. సంపత్, నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వాల్మీకి నాయకులు కేంద్ర సామజిక న్యాయ సంక్షేమ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసి న్యాయబద్దమైన బోయల ఎస్టీ డిమాండ్‌ను పునరుద్ధరించాలని కోరారు.

వాల్మీకులు పలు రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీలుగా ఉన్నా, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కేవలం ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఎస్టీలుగా ఉన్నారని, మైదాన ప్రాంతంలో ఉన్నవారు బీసీ లుగా ఉన్నారని వివరించారు. అనంతరం వారందరూ కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్ ఝాను కలిసి తమ సమస్యలు వివరించారు. అనంతరం సంపత్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి వాల్మీకి, బోయలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారని అన్నారు. 2017 కంటే ముందు ఏ హామీ ఇచ్చి టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చిందో దాన్ని నిర్వర్తించడంలో భాగంగా చెల్లప్ప కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు.

- Advertisement -

వాల్మీకి, బోయల జీవన స్థితిగతుల పై చెల్లప్ప కమిటీ నివేదిక ఇచ్చిందని, ఈ కమిటీపై కేసీఆర్ ప్రభుత్వం స్పందించి 2017 ఏప్రిల్ 12న రిజల్యూషన్ పాస్ చేసిందని వివరించారు. కానీ వాల్మీకి బోయలకు సంబంధించిన ఎటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాలేదని అధికారులు, కేంద్రమంత్రులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. వాల్మీకి, బోయలు చర్చించుకుని రాజకీయ పార్టీలపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే దానిపై చర్చించుకుంటామని సంపత్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాల్మీకి, బోయలను గిరిజన జాతిలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement