Friday, November 22, 2024

విజయసాయిరెడ్డిని కలిసిన ఢిల్లీ టీయుడబ్ల్యుజే.. రెండోసారి రాజ్యసభకు ఎన్నికైనందుకు అభినందనలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధానిలో పని చేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. రెండోసారి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన విజయసాయిరెడ్డికి టీయుడబ్ల్యుజే ( తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ) ఢిల్లీ కమిటీ అభినందనలు తెలిపింది. టీయుడబ్ల్యుజే ఢిల్లీ కమిటీ అధ్యక్షుడు వెంకటేష్ నాగిళ్ల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మంగళవారం ఉదయం తుగ్లక్ లేన్‌లోని ఆయన నివాసంలో కలిశారు. విజయసాయిరెడ్డికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు జర్నలిస్టులతో ముచ్చటించారు. కరోనా సమయంలో అండగా నిలిచిన విజయసాయికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే తమ సమస్యలనూ వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో పని చేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సూచనలను సావధానంగా విన్న విజయసాయిరెడ్డి తన పరిధిలో ఉన్న అంశాలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మిగతా అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాన్నన్నారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యుజే ప్రధాన కార్యదర్శి తిరుపతి వంగ, ఉపాధ్యక్షురాలు స్వరూప పొట్లపల్లి, కోశాధికారి శిరీష్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సమన్వయకర్త రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శులు రాజు, జబ్బార్ నాయక్, సభ్యులు మహాత్మ, ఆచార్య శరత్‌చంద్ర, అశోక్ రెడ్డి, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement