Friday, November 22, 2024

Delhi Tour – హస్తినలో రేవంత్‌ బిజీబీజీ ..ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో భేటీ

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. శుక్రవారం రెండో రోజు న్యూఢిల్లీలో తన సమావేశాలను కొనసాగిస్తున్నారు. కాగా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోనీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో సీఎంతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారు. ఇక‌.. UPSC చైర్మన్‌తో జరిగే సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పునరుద్ధరించే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలపై సీఎం రేవంత్ చర్చించారు. రిక్రూట్‌మెంట్ పరీక్షల నిర్వహణలో యూపీఎస్‌సీ అవలంబిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాలతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది.

ఇక‌.. గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర జలవనరుల శాఖ మంత్రితోపాటు మరో ఇద్దరు మంత్రులను క‌లిశారు. ఇక‌.. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అదేవిధంగా ఏటా జాబ్‌ క్యాలండర్ ఇస్తామ‌ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టిసారించింది. మరోవైపు టీఎస్‌పీఎస్సీపై పలు ఆరోపణల నేపథ్యంలో చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డితోపాటు ముగ్గురు సభ్యులు రాజీనామా చేసిన విషయం విధితమే. వారి రాజీనామాలను గవర్నర్‌ తమిళిసై పెండింగ్‌లో పెట్టారు.

పాల‌మూరుకు జాతీయ హోదా ఇవ్వండి… కేంద్ర జ‌ల‌వ‌న‌రుల‌ మంత్రికి సీఎం విన‌తి

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్​ ఇరిగేషన్​ పథకానికి జాతీయ హోదా కల్పించాలని కోరుతూ సీఎం రేవంత్​రెడ్డి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ను కోరారు. ఈ మేర‌కు ఆయ‌న‌కు వినతిపత్రం అంద‌జేశారు. ఈ భేటీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కూడా ఉన్నారు. ఇక‌.. సంక్రాంతి పండుగకు ముందే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నాయకత్వంతో రేవంత్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఏఐసీసీతో జరిగే ఈ సమావేశానికి కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement