దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు వాడితే రూ.10 వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. తాజాగా కేంద్రం ప్రకటించిన వాహనాల తుక్కు పాలసీని కఠినంగా అమలు చేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. ఢిల్లీలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య 3.5 లక్షలుగా ఉన్నట్లు అంచనా. కానీ 2018లో కేంద్రం తొలిసారి ఈ తుక్కు పాలసీని ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకూ కేవలం 2831 వాహనాలను మాత్రమే తుక్కు చేశారు. అంటే ఇది ఒక శాతం కంటే తక్కువ.
మోటారు వాహనాల చట్టం ప్రకారం ఇలాంటి వాహనాలకు గరిష్ఠంగా రూ.10 వేలు జరిమానా విధించవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కూడా ఇలాంటి వాహనాలకు జరిమానాలు విధించే, తుక్కు చేసే అధికారం కూడా రవాణా శాఖకు ఉంది. కాలం చెల్లిన వాహనాల జాబితాను కూడా వేసి, ఆయా యజమానుల తమ వెహికిల్స్ తీసుకురావాల్సిందిగా ఆదేశించాలని కూడా రవాణా శాఖకు సుప్రీంకోర్టు సూచింది. ఇప్పటికైతే ఇలాంటి వాహనాలను గుర్తించడానికి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టకపోయినా.. ఇలాంటి నోటిఫికేషన్ల వల్ల సదరు యజమానులు తమ వాహనాలను తీసుకొస్తారని రవాణా శాఖ భావిస్తోంది.