న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారీ వరదల వల్ల రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ముమ్మాటికీ కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యమేనని తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరవడానికి ఢిల్లీ వచ్చిన ఆయన శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణలో అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, ఇప్పటికే 20 మంది చనిపోవడంతో పాటు మరో 25 మంది గల్లంతయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
వేలాది ఇళ్లు నీట మునిగాయని, లక్షల ఎకరాల్లో పంట, ఆస్తి నష్టం జరిగిందని, రోడ్లు ధ్వంసమయ్యాయని వాపోయారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని బండి సంజయ్ విమర్శించారు. ముందే మేల్కొని ఉంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే అవకాశముండేదని అభిప్రాయపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగేవరకు రాష్ట్ర బృందాలు ముంపు ప్రాంతాల్లోకి వెళ్లలేకపోయాయని అన్నారు.
రాష్ట్ర అధికారులు కష్టపడుతున్నా ప్రభుత్వం నుండి సరైన సహకారం అందకపోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరానిదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన సహాయ పునరావాస చర్యలు తీసుకోవాలని సూచించారు. మరణించిన వారి ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షలు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలంతా ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. తాను ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానని సంజయ్ వెల్లడించారు.