న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 100 రోజుల పాలన చూసి ఇతర పార్టీల నుంచి నేతలు తమంతట తాముగా వచ్చి చేరుతున్నారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, బీజేపీ నేత జితేందర్ రెడ్డి టికెట్ దక్కించుకోలేదన్న అసంతృప్తిలో ఉన్నారని, అందుకే ఆయన పార్టీలో చేరతారన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి కలిశారని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి అభ్యర్థులు లేకనే ఇతర పార్టీల నుంచి చేర్చుకుని టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీలో బలమైన అభ్యర్థులున్నారని, త్వరలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేస్తుందని వెల్లడించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి తనదే మొదటి దరఖాస్తు అన్న మల్లు రవి, రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పాలన గురించి మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ కోసం టీఆర్ఎస్ స్ఫురణకు వచ్చేలా టీఎస్ అని పెట్టారని, కానీ తాము వచ్చి ఆ తప్పును సరిదిద్ది టీజీ గా మార్చామని అన్నారు.
గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోయిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ అనుమతులను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సాధించిందని అన్నారు. నేషనల్ హైవే-44పై రెండు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించేందుకు రక్షణ శాఖ అనుమతించిందని, తద్వారా రాష్ట్రంలోని 5 జిల్లాల ప్రజలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. రూ. 1,550 కోట్లతో 5.50 కి.మీ మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపడతామని, సెకండ్ ఫేజ్‌లో మెట్రో మార్గం కూడా ఉందని వివరించారు.
రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు డిఫెన్స్ కమిటీ సభ్యులుగా ఉండి ఈ అంశాన్ని నిత్యం కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ వచ్చారని, ప్రభుత్వం ఏర్పడగానే అవసరమైన చర్యలు చేపట్టారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తోందని, అయితే ప్రతిపక్షాలు తెలంగాణ ప్రజల తీర్పును గౌరవించడం లేదని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న దుర్భుద్ధితో కొందరు పనిచేస్తున్నారని నిందించారు. గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టును నాసిరకంగా కట్టారని అన్నారు. డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.