Saturday, January 18, 2025

Delhi | భ‌విష్య‌త్ అంతా ‘ఈవీ’ ల‌దే.. ప్ర‌ధాని మోడీ

  • పెట్టుబడులకు భార‌త్ స్వర్గధామం
  • ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి భారీ ప్రొత్స‌హ‌కాలు
  • ఇప్ప‌టికే 2.50 కోట్ల ఎల‌క్ట్రిక్‌ వాహ‌నాల అమ్మ‌కం
  • భారత్ మొబిలిటీ ఎక్స్ పో 2025 ప్రారంభించిన మోదీ


న్యూ ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : భారత్ పెట్టుబడులకు స్వర్గధామమని, మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును రూపొందించుకోవాలని చూస్తున్న ప్రతీ పెట్టుబడిదారుడికి అత్యుత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఢిల్లీలో శుక్ర‌వారం నుంచి 22వ తేదీ వ‌ర‌కు కొన‌సాగే భారత్ మొబిలిటీ ఎక్స్ పో-2025ను ప్ర‌ధాని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… గ్రీన్ టెక్నాలజీ, ఈవీలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై భారతదేశం దృష్టి సారిస్తోందన్నారు.

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశంలో ఆటో పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ దశాబ్దం చివరికి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరుగుతాయన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంద‌ని వెల్ల‌డించారు.. దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకీ భారతదేశ ఆటో రంగం వృద్ధికి.. మధ్య తరగతి ప్రజల కలను నెరవేర్చడానికి ఎంతో సహకారం అందించారని ప్ర‌శంస‌లు కురిపించారు.

ఈవీల‌కు సబ్సీడీలు..
ఈవీల‌ అమ్మ‌కాల‌ను ప్రొత్స‌హించేందుకు అయిదేళ్ల క్రితం ప్రారంభించిన ఫ్రేమ్-2 పథకం కింద ₹8000 కోట్లకు పైగా సబ్సిడీగా ఇచ్చామని ప్రధాని పేర్కొన్నారు. దీంతో 16లక్షలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు రోడ్ల‌పై తిరుగుతున్నాయ‌న్నారు. ఢిల్లీలోనే 1200కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయన్నారు. ఒకప్పుడు దేశంలో నాణ్యమైన రోడ్లు లేకపోవడంతో ప్రజలు కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోయేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారుతుండటంతో కార్లకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ఏడాదికి దాదాపు 2.5 కోట్ల కార్లు విక్రయమవుతున్నాయని తెలిపారు.

- Advertisement -

పట్టణీకరణతో ఆటోరంగం దూకుడు..
పెరుగుతున్న మధ్య తరగతి, వేగవంతమైన పట్టణీకరణ, సరసమైన వాహనాలు భారతదేశంలో ఆటో రంగాన్ని ముందుకు తీసుకు వెళుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. దాదాపు 25కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, వీరు వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్నారని చెప్పారు. ఈవీలను ప్రోత్సహించడానికి పలు ప్రాంతాల్లో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement