న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై వస్తున్న కథనాలన్నీ కేవలం ప్రచారం మాత్రమేనని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, ఎంపీ డా. కే. లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణలో కనుమరుగు కాబోతుందని అన్నారు.
ఆ పార్టీ మనుగడ కూడా కష్టమేనని, ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ పూర్తిగా బీజేపీ – కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని తెలిపారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ ప్రజలు కాంగ్రెస్ ప్రకటించిన ఉచితాలను తిరస్కరించారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ అనుకూలత కారణంగానే విజయం సాధించగలిగామని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ ఎన్నికలుగా చెప్పుకున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారని, ఫైనల్స్(లోక్సభ ఎన్నికల్లో)లో కూడా బీజేపీనే గెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరూ ఓబీసీ వ్యతిరేకులేనని, దక్షిణ – ఉత్తర భారతం అంటూ దేశ ప్రజలను విభజించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని మండిపడ్డారు.
ఉత్తర భారత ఓటర్లను కించపరిచేలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. ద్రవిడ – ఆర్య సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చి కాంగ్రెస్ పబ్బం గడువుకుంటోందని చెప్పారు. మోడీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి రావడం పక్కా అని వ్యాఖ్యానించి డా. కే. లక్ష్మణ్.. దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం మోడీ గ్యారెంటీ అన్నారు.