ఢిల్లీ పొంగమంచు మయమైంది. దీంతో చలితీవ్రత విపరీతంగా పెరిగింది. అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో రోడ్లు సైతం కనిపించని పరిస్థితి ఏర్పడుతోంది.ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగ మంచు కారణంగా ఢిల్లీలో పలు రైళ్ల రాకపోకలకు ఆలస్యం జరుగుతోంది.
నేడు ఢిల్లీకి చేరుకోవాల్సిన 25 రైళ్లు ఆలస్యంగా చేరుకున్నాయి. ఢిల్లీలో విజిబిలిటీ లెవెల్ 25 మీటర్లుగా నమోదైంది. హరియాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోనూ విజిబిలిటీ స్థాయి పడిపోయింది. పొగ మంచు, కాలుష్యం వల్ల ఉత్తరాదిలో వాయు నాణ్యత కూడా క్షీణిస్తోంది. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. అనేక చోట్ల రోడ్లపై దట్టమైన పొగమంచు కమ్ముకుంది. విజిబిలిటీ లెవల్ పడిపోతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల విపరీతమైన చలి గాలులు వీస్తున్నాయి. పొగమంచు కారణంగా పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముందున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి.