Wednesday, November 20, 2024

Delhi | ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద శేజల్ నిరసన.. తెలంగాణ ప్రభుత్వ తీరుపై విమర్శలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మణిపూర్‌ బాధిత మహిళల కోసం గొంతెత్తుతున్న బీఆర్‌ఎస్ ఎంపీలు సొంత రాష్ట్రంలో సొంత పార్టీ ఎమ్మెల్యే వేధింపులపై ఎందుకు ప్రశ్నించడం లేదని ఆరిజిన్ డైరీ డైరెక్టర్ బోడపాటి శేజల్ ప్రశ్నించారు. శుక్రవారం ఆమె న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. అనంతరం శేజల్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగంలో మహిళలకు కల్పించిన హక్కులను కాపాడాలంటూ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశానని తెలిపారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనకు అన్యాయం చేశాడంటూ ఆరు నెలలుగా పోరాటం చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. గత వారం రోజులుగా పార్లమెంట్ ఎదుట నిరసన తెలుపుతున్నా తెలంగాణ ఎంపీలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ మహిళలకే హక్కులున్నాయా? నేను మహిళను కాదా? నాకు హక్కులు లేవా? అంటూ శేజల్ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. తాను శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తుంటే పోలీసులను అడ్డుకుంటున్నారని చెప్పుకొచ్చారు. వెంటనే దుర్గం చిన్నయ్య మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దుర్గం చిన్నయ్య ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని, త్వరలో వాటి వివరాలు బయటపెడతానని ఆమె హెచ్చరించారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని శేజల్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement