న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ సిటీస్ మిషన్ కోసం రూ.3,538 కోట్ల నిధులను విడుదల చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో రూ. 2726.43 కోట్లు మాత్రమే వినియోగించారని తెలిపింది. సాంకేతికతను మెరుగుపరచడం, డేటా నిర్వహణను పెంచడం ద్వారా పౌరుల జీవన నాణ్యతను పెంచే లక్ష్యంతో 2015వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి విడుదలైన నిధులపై వైసీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కౌశల్ కిషోర్ శుక్రవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఈ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా కేంద్రం వంద నగరాలను ఎంపిక చేయగా అందులో ఏపీ నుంచి అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలు ఉన్నాయని, ఆక్కడ 279 స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఆమోదం పొందాయని తెలిపారు. వీటిలో 203 ప్రాజెక్టులు 73శాతం పూర్తి కాగా, మిగిలిన 76 ప్రాజెక్టులు 27 శాతం పునులు ఇంకా కొనసాగుతున్నాయని వివరించారు. విడుదలైన నిధుల్లో విశాఖపట్నం అత్యధిక నిధులు వినియోగించగా.
తిరుపతి, కాకినాడ, అమరావతి తర్వాతి స్థానాల్లో ఉన్నాయని కేంద్రమంత్రి చెప్పారు. ప్రాజెక్టుల విషయానికి వస్తే తిరుపతిలో అత్యధికంగా 105 ప్రాజెక్టులుండగా ఆ తర్వాతి స్థానాల్లో కాకినాడలో 94, విశాఖపట్నంలో 61, అమరావతిలో 19 ఉన్నాయని జవాబులో పేర్కొన్నారు. ఈ నగరాలలో ప్రాజెక్టుల పూర్తి కావడంలో తిరుపతి 60 శాతం, కాకినాడ 76.60 శాతం, విశాఖపట్నం – 91.8 శాతం, అమరావతి – 63.16శాతమని చెప్పారు.