జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ‘శివలింగం’ లభ్యమైన ఘటనపై ఢిల్లి వర్శిటీలోని హిందూ కాలేజీ హిస్టరీ ప్రొఫెసర్ రతన్ లాల్ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ”దేశంలో మీరు దేని గురించి మాట్లాడినా… అది మరొకరి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుంది. ఇది కొత్తేమీ కాదు. నేను చరిత్రకారుడిని, అనేక పరిశీలనలు చేశాను. నా పరిశీలనలో నేను అన్వేషించిన వాటి గురించి రాశాను. నన్ను నేను రక్షించుకుంటాను” అని వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నట్లు న్యాయవాది వినీత్ జిందాల్ ఢిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారంనాడు రతన్‌లాల్‌పై ఐపీసీ 153ఏ, 295ఏ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ప్రొఫెసర్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లి సైబర్‌క్రైం పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా రతన్‌లాల్ మాట్లాడుతూ… జ్ఞానవాపి మసీదుపై వ్యాఖ్యల తర్వాత తన కుమారుడికి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రతన్‌లాల్ అరెస్ట్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఖండించారు. రాజ్యాంగబద్ధమైన అభిప్రాయం, భావ వ్యక్తీకరణ హక్కు ఆయనకు ఉందని పేర్కొంటూ ట్వీట్ చేశారు. కాగా, బెయిల్ కోసం ఢిల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, శనివారంనాడు విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనల అనంతరం ప్రొఫెసర్ రతన్‌లాల్‌కు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..