ఢిల్లీ – అధికారం మారిన తర్వాత జరిగిన బదిలీల్లో కొన్ని వస్తువులు మాయమయ్యాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకు ఎవరు బాధ్యులో తేల్చే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశం బయటకు వచ్చిందని పేర్కొన్నారు. జాతీ వ్యతిరేక శక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేయవచ్చునని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో నేడు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ విచారణలో తమ ప్రమేయం లేదని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపదని హామీ ఇచ్చారు. అన్నింటికి సీబీఐ విచారణను అడిగే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు వారి హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్ర గీత స్వరకల్పన అందెశ్రీకి అప్పగించాం…
తెలంగాణ రాష్ట్ర గీతానికి స్వరకల్పన బాధ్యతను అందెశ్రీకి అప్పగించినట్లు చెప్పారు. ఎవరితో సంగీతం సమకూర్చుకుంటారనేది ఆయన ఇష్టమన్నారు. రాష్ట్ర చిహ్నంలో రాచరిక పోకడలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. అందుకే రాచరికం ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటుందన్నారు. సమ్మక్క, సారక్క, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకు అద్దం పట్టేలా ఈ చిహ్నం ఉంటుందన్నారు. విద్యుత్ కోతలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధాం ఇస్తూ, తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని అన్నారు.. విద్యుత్ వినియోగం పెరిగినా లోటు లేకుండా ఇస్తున్నట్లు చెప్పారు.