న్యూఢిల్లి : ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లి – మాస్కో మధ్య నడిచే ఎయిరిండియా విమానాలను తాత్కాలికంగా రద్దు చేసింది. యుద్ధం దృష్ట్యా బీమా సమస్యలు తలెత్తడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లి – మాస్కో మధ్య వారంలో రెండు సార్లు ఎయిరిండియా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అయితే, వీటిని తాజాగా రద్దు చేశారని రష్యన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొన్నట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ ‘టాస్’ కథనం వెల్లడించింది. విమాన టికెట్ల విక్రయాలను భారత్‌కు చెందిన ఎయిరిండియా నిలిపివేసింది.
ఈ మార్గంలో సేవలను ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై స్పష్టత లేదు. ఈ మార్గంలో ఎయిరిండియా విమాన టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు నగదు రీఫండ్ చేయనున్నారు అని ఎంబసీ తెలిపింది. అయితే, విమానాల రద్దుపై ఎయిరిండియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బీమా కవరేజ్ ఇచ్చేందుకు సంస్థలు ముందుకు రావట్లేదని, అందువల్లే ఈ సర్వీసులను రద్దు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..