ఎన్డీయే పార్లమెంటరీ లీడర్ నరేంద్ర మోదీ నేడు (శుక్రవారం) సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా తనను లోక్ సభ పక్షనేతగా ఎన్డీయే మిత్రపక్షాలు ఎన్నుకున్న తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు. తమ కూటమికి మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలు, కొత్తగా ఎంపికైన మొత్తం ఎంపీల జాబితాను రాష్ట్రపతికి మోదీ అందించారు. మోదీ వెంట ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు ఉన్నారు.
ఈ క్రమంలో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోదీని రాష్ట్రపతి ఆహ్వానించారు. మోదీకి రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఓ జ్ఞాపికను బహూకరించారు. కాగా రాష్ట్రపతి ఆహ్వానం మేరకు ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేందుకు మోదీ సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణస్వీకారం చేసేలా ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.