దేశంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయడమే ప్రదాని మోదీ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపుతున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు, మనీలాండరింగ్ కేసులో అరెస్టై మధ్యంతర బెయిల్ పై విడుదలైన ఆయన శనివారం ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలను జైలుకు పంపి రాజకీయాలను పూర్తిగా నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని మండి పడ్డారు. ఇప్పటికే తనతో పాటు విపక్ష పార్టీలకు చెందిన టాప్ లీడర్స్, మంత్రులు జైల్లో ఉన్నారని అన్నారు.
బీజేపీ గెలిస్తే వాళ్లంతా జైలుకే..
దేశంలో మరోసారి బీజేపీ గెలిస్తే.. ఈసారి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, కేరళ సీఎం పినరయి విజయన్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలంతా జైల్లో ఉంటారని కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, బీజేపీ నేతలు వివిధ కేసుల్లో ఉన్నా.. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే, మనోహర్ లాల్ ఖట్టర్, రమణ్ సింగ్ మాత్రం తమ రాజకీయాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు కొనసాగుతున్నారని మండిపడ్డారు.. ఈడీ,ఐటీ, సీబీఐ దాడుల్లో పట్టబడిన నేతలు బీజేపీలో చేరిన వెంటనే పునీతులైపోతున్నారని విమర్శించారు. విపక్షం లేకుండా ఉంటే అది ప్రజాస్వామ్యం కాదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.